తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టును ఏపీ ఆర్థికమంత్రి యనమల రామక్రిష్ణుడికి తెలంగాణ సీఎం ఎలా  ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే ఏపీ వ్యక్తైన పయ్యావుల కేశవ్ అల్లుడు పెట్టబోయే బీరు తయారీ సంస్థకి కూడా టీసర్కార్ లైసెన్స్ ఇవ్వడమేమిటని అడిగారు. ఇటీవలే ఢిల్లీ వెళ్ళి రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్న క్రమంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరిటాల సునీత కుమారుడి వివాహానికి కేసీఆర్ ఆంధ్రా వెళ్లినప్పుడు అక్కడి మంత్రులు వంగి వంగి దండాలు పెట్టారని... అదే చంద్రబాబు హైదరాబాద్ వస్తే పట్టించుకొనే నాథుడే లేడని అన్నారు. తెలంగాణలో టీడీపీ నేతలను జైల్లో పెట్టించిన కేసీఆర్‌‌కు అంతగా మర్యాదలు చేయాల్సిన అవసరమేమిటని అడిగారు. కేసీఆర్ పట్ల తెలంగాణలో వ్యతిరేకత మొదలైందని, అలాంటి సందర్భంలో ఏపీలో మంత్రులు అన్నం పెట్టినవాళ్ళకే సున్నం పెడుతున్నారని అభిప్రాయపడ్డారు. 


ఏపీలోనే టీడీపీతో పొత్తు ఉంటుందన్న బీజేపీ, తెలంగాణ విషయంలో అలాంటిదేమీ లేదని ఎప్పుడో చెప్పిందని.. అలాంటప్పుడు తెలంగాణలో టీడీపీ మరో పార్టీతో జతకడితే తప్పేంటని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సింగరేణి ఎన్నికల విషయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనబరిచే విషయంలోనూ మేము కాంగ్రెస్‌తో గతకొంతకాలంగా కలసి పనిచేస్తు్న్నామని ఆయన స్పష్టం చేశారు.


తెలంగాణలో టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న విషయంపై తాను చంద్రబాబుతో చర్చిస్తానని, స్థానిక పరిస్థితులను బట్టి పొత్తుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ఎప్పుడో చెప్పారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ లేదని, అందుకు బండారు దత్తాత్రేయను మంత్రి పదవిని తొలిగించడమే నిదర్శనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.