KTR on Modi: చెప్పిందొకటి... చేసిందొకటి.. మోదీ `అచ్చె దిన్` హామీపై కేటీఆర్ సెటైర్స్
Minister KTR Satires on Modi: తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై ట్విట్టర్ వేదికగా సెటైర్స్ వేశారు. ఎనిమిదేళ్ల క్రితం దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని హామీ ఇచ్చిన మోదీ.. ఎనిమిదేళ్లలో చాలా బాగా చేశారంటూ సెటైర్స్ వేశారు.
Minister KTR Satires on Modi: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్ అవినీతి పార్టీ అని.. రజాకార్ల పాలన అని బీజేపీ విమర్శిస్తుంటే.. బీజేపీ బక్వాస్ జుమ్లా పార్టీ అని టీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మంత్రి కేటీఆర్ విపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలో దూకుడు పెంచారు. ఓవైపు రాష్ట్ర బీజేపీ నేతలను ఏకిపారేస్తూనే మరోవైపు ప్రధాని మోదీ, అమిత్ షాలకు గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
'ప్రియమైన మోదీ గారు.. ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని మీరు హామీ ఇచ్చారు. కానీ ఈ ఎనిమిదేళ్ల మీ పాలనలో డాలర్ మారకంలో రూపాయి విలువ రూ.77కి పడిపోయింది. నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ప్రపంచంలో ఎల్‌పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశం మనదే. ఆర్థిక వ్యవస్థ గత 42 ఏళ్లలో ఇప్పుడే ఇంతలా పతనమైంది.' అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చాలా బాగా చేశారు సార్... అంటూ చివరలో చురకలంటించారు.
సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. ఫలితాలపై ట్విట్టర్‌లో స్పందించిన మోదీ... 'ఇది భారత్ విజయం... దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి...' అంటూ ట్వీట్ చేశారు. అదే ట్వీట్‌ను ఇప్పుడు రీట్వీట్ చేసిన కేటీఆర్... ఎనిమిదేళ్ల మోదీ సర్కార్ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కేటీఆర్ గట్టిగా నిలదీసిన సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభలో పాల్గొనడానికి వచ్చిన అమిత్ షాకు 27 ప్రశ్నలతో కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని అందులో ఏకరువు పెట్టారు. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారంటూ ఘాటుగా ప్రశ్నించారు. తాజాగా మోదీపై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: Karachi Blast: పాకిస్తాన్‌లో భారీ పేలుడు... ఒకరు మృతి, 13 మందికి గాయాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.