తెలంగాణలో సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సర్కార్‌పై, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రేపే ఈ విషయమై తాము తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని, అక్కడ న్యాయం లభించకపోతే అవసరమైతే సుప్రీం కోర్టునైనా ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై వారికి కలిగిన లబ్ధికి సంబంధించిన ఆధారాలతో యుక్తంగా లోక్‌పాల్‌లో కేసులు వేస్తామని స్పష్టంచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. జూన్ 8వ తేదీన తాము 36 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.


సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియ, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య వంటి 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కలిసి సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు అసెంబ్లీ అధికారవర్గాలు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.