సరికొత్త ట్విస్ట్: మహాకూటమితో సీపీఐ,టీజేఎస్ కలిసి వచ్చేనా ?
మహాకూటమిలో చీలిక వస్తుందా..? సీపీఐ, టీజేఎస్ పార్టీలు మహాకూటమి నుంచి బయటికి వస్తాయా ? ఇరు పార్టీలు కలిసి కొత్త కూటమిగా ఏర్పడి పోటీ చేస్తాయా ?..తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు విశ్లేషకులు. సీపీఐ ముఖ్య నేతలు సురవరం, నారాయణ, చాడా వెంకట్ రెడ్డిలతో కోదండరాం భేటీతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
వివరాల్లోకి వెళ్లినట్లయితే ఈ రోజు సీపీఐ ముఖ్య నేతలు సురవరం, నారాయణ, చాడా వెంకట్ రెడ్డిలతో టీజేఎస్ చీఫ్ కోదండరాం భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నకు కోదండరాం బదులిస్తూ తాను మర్యాదపూర్వకంగానే సీపీఐ నేతలతో కలిశానని వివరణ ఇచ్చారు. సీట్ల విషయంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఇదే సందర్భంలో సీపీఐ నేత చాడా మాట్లాడుతూ సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని కాంగ్రెస్ ఇప్పటి వరకు తేల్చకపోవడం బాధాకరమన్నారు. ఎల్లుండి జరిగే పార్టీ కార్యనిర్వహక భేటీలో తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
భేటీపై భిన్నాభిప్రాయాలు
కోదండరాం, చాడావెంటక్ రెడ్డిల రియాక్షన్ బట్టి చూస్తే కాంగ్రెస్ కు షాక్ ఇచ్చే సమిష్ఠి నిర్ణయం తీసుకునే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని..అందరూ మహాకూటమిలోనే కొనసాగుతారని.. కాంగ్రెస్పై అలిగిన సీపీఐను బుజ్జగించేందుకే కోదండరాం ..ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి
కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకేనా ?
వాస్తవానికి మహాకూటమిలో కాంగ్రెస్ వైఖరిపై ఈ రెండు పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి. సీట్ల సర్దుబాబు విషయంలో తమను లెక్కచేయడం లేదనే అభిప్రాయానికి వచ్చిన నేతలు కాంగ్రెస్ తో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సీపీఐకి 4 సీట్లు, కోదండరాం పార్టీకి 8 సీట్లు ఇచ్చేందుకు మాత్రమే కాంగ్రెస్ అంగీకరించింది. అందులోనూ కొన్ని మెలికలు పెట్టింది. మరోవైపు సీపీఐ 9 సీట్లు.. టీజేఎస్ 12కి తగ్గకుండా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ఏమాత్రం లెక్కచేయకుండా తమ అభ్యర్ధుల ఎంపిక పనిలో పడిన కాంగ్రెస్ కు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోవాలని ఇరువురు నేతలు భావిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీపీఐ నేతలతో కోదండరాం భేటీ చర్చనీయంశంగా మారింది.