YSRTP, Congress Merger News: విలీనం ఉన్నట్టా లేనట్టా ? షర్మిలను ప్రశ్నించిన మీడియా
YSRTP, Congress Merger News: తాజాగా వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం అంశం మరోసారి తెరపైకొచ్చింది. పార్టీ విలీనం ఇక తుది అంకానికి చేరుకున్నట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్న సమయంలోనే వైఎస్ షర్మిల తన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు. వైఎస్ షర్మిల హైదరాబాద్ వచ్చీ రావడంతోనే ఆమెని చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు ఇదే విషయమై ఆరా తీశారు.
YSRTP, Congress Merger News: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు అంటూ గత కొంత కాలంగా ఓ ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆమె ఖమ్మం జిల్లా పాలేరు నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైనే పోటీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ఆ ప్రచారం సారాంశం. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తెరవెనుక తతంగం జరిగిపోతోంది.. ఇక ఒక రైట్ టైమ్ చూసుకుని నిర్ణయం వెల్లడించడమే తరువాయి అనే టాక్ కూడా వినిపించింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తరువాత ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కి కాంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేయడం నుంచి మొదలుపెడితే.. తెలంగాణ సర్కారుపై, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న విమర్శలకు వైఎస్ షర్మిల కూడా మద్దతు ఇవ్వడం వంటి పరిణామాలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. అంతేకాకుండా జూలై 8న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ని స్మరించుకుంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా.. తన తండ్రి జయంతిని స్మరించుకున్నందుకు వైఎస్ షర్మిల... రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. చివరిగా ఇటీవల రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనూ ఆయనకు వైఎస్ షర్మిల కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇటువంటి పరిణామాలు అన్నీ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం దాదాపు ఖరారైనట్టే అనే ప్రచారానికి దోహదం చేశాయి.
ఇదిలావుంటే తాజాగా వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం అంశం మరోసారి తెరపైకొచ్చింది. పార్టీ విలీనం ఇక తుది అంకానికి చేరుకున్నట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్న సమయంలోనే వైఎస్ షర్మిల తన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు. వైఎస్ షర్మిల హైదరాబాద్ వచ్చీ రావడంతోనే ఆమెని చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశంపై ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు ఆమె ఆసక్తి చూపించలేదు. భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కదా.. మరి దానికి ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించగా.. 'చూద్దాం..' అని మాత్రమే చెబుతూ ముందుకు వెళ్లిపోయారు. ఢిల్లీలో ఏం జరిగింది అనే విషయంలో ఇప్పుడప్పుడే బహిర్గతం చేయడం వైఎస్ షర్మిల ఆసక్తిగా లేరు అనే విషయం ఆమె తీరులోనే అర్థం అవుతోంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
ఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే అంశంపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటే ఆమెను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమే అని అన్నారు. తెలంగాణవ్యాప్తంగా ప్రజల కోసం పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల వంటి నాయకురాలు తమ పార్టీలోకి వస్తే తమకు కూడా లాభమే జరుగుతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయాల గురించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. " తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకుని మహారాష్ట్ర సహా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుటున్నప్పుడు షర్మిల తెలంగాణకు వస్తే తప్పేంటి " అని అన్నారు. వైఎస్ షర్మిల వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఓట్లు వచ్చినా, 400 ఓట్లు వచ్చినా మంచిదే కదా అని చెప్పుకొచ్చారు. ఒకవేళ వైఎస్ షర్మిల గురించి కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అడిగితే తన అభిప్రాయం చెప్పడానికి కూడా సిద్ధమే అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో ఐటి శాఖ మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.