YS Sharmila Slams MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు చురకలంటించిన వైఎస్ షర్మిల రెడ్డి
YS Sharmila Shows Her Sarcasm To BRS MLC Kalvakuntla Kavitha: మహిళా బిల్లుపై దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ కవితకు వైఎస్ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ పార్టీ జాబితా చూసి మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చారా ? లేదా ? అనేది క్యాలిక్యులేటర్తో మీరే లెక్కించండి అని చురకలంటించారు.
YS Sharmila Shows Her Sarcasm To BRS MLC Kalvakuntla Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మద్దతు కోరుతూ తనకు లేఖ రాసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఘాటైన చురకలంటించారు. సమాజంలో మనం ఏదైనా మార్పు కోరుకుంటే.. ఆ మార్పు ముందుగా మన నుండే మొదలు కావాలి అని మహాత్మా గాంధీ చెప్పినట్లుగా మీరు చూడాలి అనుకుంటున్న మార్పు, మీ నుంచే మొదలు పెట్టండి అంటూ కవితకు వైఎస్ షర్మిల సూచించారు. మీ బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి మహిళలకు 5 శాతం కూడా సీట్లు ఇవ్వలేదని చెబుతూ మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరిని వేలెత్తి చూపిన వైఎస్ షర్మిల.. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో తన అభిప్రాయంతో పాటు, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సైతం పంపుతున్నానని.. అలాగే ఆ జాబితాతో పాటే ఒక ఆన్ లైన్ కాలిక్యులేటర్ లింక్ సైతం పంపిస్తున్నాను అని బదులిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జాబితా చూసి మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చారా ? లేదా ? అనేది ఆ క్యాలిక్యులేటర్ తో మీరే లెక్కించండి అని చురకలంటించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మద్దతు కూడగట్టడానికి ముందుగా మీరు మీ తండ్రితో ఈ విషయం చర్చించాలని మనవి చేస్తున్నానన్న వైఎస్ షర్మిల రెడ్డి.. తెలంగాణలో మహిళలకు న్యాయం చేయకుండా మహిలా రిజర్వేషన్ బిల్లు కోసం జరిగే ఈ పోరాటాన్ని జాతీయ వేదికపై ఎలా ముందుకు తీసుకువెళ్తారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సూటిగా ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ కోసం మీరు రాసిన లేఖ అందిందన్న వైఎస్ షర్మిల.. " మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి దాకా మహిళలకు 5 శాతం కంటే ఎక్కువ సీట్లు కేటాయించలేదు. తెలంగాణ కేబినెట్ లోనూ మహిళలకు ప్రాధాన్యత కల్పించ లేదు. సీఎం కూతురిగా మీరు మీ తండ్రిని ఏనాడూ ఈ అంశంపై ప్రశ్నించలేదు. మీ పార్టీలో, మీ ప్రభుత్వంలోనే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు ఢిల్లీ వేదికగా ఉద్యమం చేయడం హాస్యాస్పదమే అవుతుంది " అని ఘాటుగా స్పందించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ముందుగా మీరు మీ చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇవ్వండి. ఇదే మీ ఉద్యమానికి మొదటి అడుగు అవ్వాలి. ఇక్కడ తేల్చకుండా ఢిల్లీ వేదికగా ఉద్యమం చేయడం బీఆర్ఎస్ పార్టీ ద్వంద వైఖరికి నిదర్శనం అవుతుంది అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. మహిళా బిల్లుపై దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టే ముందు కవిత కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ వైఎస్ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు
2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మహిళలకు మీరిచ్చిన సీట్లు ఎన్ని ? 2014లో మహిళలకు మీరిచ్చిన సీట్లు 6 అని గుర్తుకు లేదా ? 2018 లో మీరిచ్చిన సీట్లు 4 అని మీకు కనపడటం లేదా ? సీట్ల కేటాయింపు లో ఒక మహిళగా మీరు నోరు ఎందుకు ఎత్తలేదు ? 2014 లో మీకు ఒక ఎంపీ స్థానం, 2019లో ఇద్దరికీ అవకాశం ఇదేనా మహిళలకు పెద్దపీట ? మీ మొదటి దఫా ప్రభుత్వంలో మహిళా మంత్రి ఎందుకు లేరు ? సుదీర్ఘకాలం పాటు ఎందుకు మహిళా కమిషన్‌ను పెండింగ్‌లో పెట్టారు ? మహిళా బిల్లుపై మీరు ఢిల్లీకి వెళ్లి దీక్ష చేసిన తర్వాత కూడా ఇటీవల చేసిన ప్రకటనలో 7 సీట్లు మాత్రమే కేటాయించడం ఏంటి ? మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని మీరు ఇతర పార్టీల చిత్తశుద్ధిని ఎలా ప్రశ్నిస్తారు ? మీకు ఆ హక్కు ఎక్కడిది ? తెలంగాణలో మహిళలను తొక్కింది మీ ప్రభుత్వం కాదా ? మహిళలపై దాడులు చేసి కించపరిచింది మీ పార్టీ కాదా ? ఉన్నట్లుండి మహిళా రిజర్వేషన్లు అంటూ ముందటేసుకున్న మీ ఆంతర్యం ఏంటి ? రాబోయే ఎన్నికల్లో మహిళల నుంచి వచ్చే వ్యతిరేకత దృష్ట్యా నష్ట నివారణ చర్యల్లో ఇది ఒక ఎత్తుగడ అని అనుకోవచ్చా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సూటిగానే ప్రశ్నల వర్షం గుప్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాను అని బదులిచ్చిన వైఎస్ షర్మిల.. ఒక మహిళగా తెలంగాణ అసెంబ్లీలో, పార్లమెంట్‌లో హక్కుల కోసం జరిపే పోరాటంలో నా మద్దతు ఎప్పుడు ఉంటుంది అని అన్నారు. కానీ మహిళా రిజర్వేషన్ విషయంలో మీ రాజకీయ క్రీడలో నేను భాగం కాలేను అని సూటిగానే బదులిచ్చారు. తెలంగాణ మహిళా వాదాన్ని చేపట్టి, మీ తండ్రిని నిలదీసిన పక్షంలో నా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఇది మీతో సాధ్యపడుతుంది అని నేను భావిస్తున్నానన్న షర్మిల.. తెలంగాణ మహిళా వాదాన్ని మీరు భుజంపైకి ఎత్తుకుంటే మీతో కలిసి పోరాటం చేసే తొలి మహిళను తానే అవుతానన్నారు.
సమాజం కోసం కోరుకునే మార్పు ఏదైనా ముందుగా మన ఇంటి నుంచి మొదలు కావాలని పెద్దలు చెప్పారు. అందుకే కవిత ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని వైఎస్ షర్మిల సూచించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా మీకు పంపుతున్నా. ఆ జాబితా చూసి ఢిల్లీ విమానం ఎక్కే ముందు మహిళలకు ఎంత శాతం ఇచ్చారో చూసుకోవాలన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మహిళా సంస్కరణలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎదురు చూస్తున్నామని చెబుతూనే.. మీరు చూడాలి అనుకుంటున్న మార్పు.. ముందుగా మీ నుంచే మొదలు పెట్టండి అంటూ చివరిగా మరోసారి మహాత్మా గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేశారు.