YS Sharmila: కేసీఆర్ దొర ప్రసంగమంతా అబద్ధాలమయం.. అరచేతిలో వైకుంఠం: వైఎస్ షర్మిల
YS Sharmila On CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చి స్పీచ్‌పై కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. ఆయన ప్రసంగం అంతా అబద్దాలమయం అని అన్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పల పాలుజేశారని ఫైర్ అయ్యారు.
YS Sharmila On CM KCR: సీఎం కేసీఆర్ దొర ప్రసంగమంతా అబద్ధాలమయం.. అరచేతిలో వైకుంఠం అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పదేండ్లలో కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లు అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోతుందో లేదో కానీ కేసీఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటోందని సెటైర్లు వేశారు. సకల జనుల పోరాటాన్ని తెలంగాణ రూపంలో దొర చేతిలో పెడితే.. రాష్ట్రాన్ని అప్పులపాలు, అధోగతి పాలుజేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎడమకాలు చెప్పుకింద తొక్కిపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వతోముఖాభివృద్ధి, ఉజ్వల ప్రగతి అంటే ఏంటి దొరా..? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. నిధులు, నీళ్లు, నియామకాలను మంటగలపడమా..? అని నిలదీశారు. రెండుసార్లు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడమా..? అని అడిగారు. తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు పెరిగితే .. ఒక్కొక్కరి మీద రూ.1.50 లక్షల అప్పు ఎందుకు ఉన్నట్లు అని అన్నారు. 2014లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌గా తెలంగాణ.. 2023 నాటికి 5 లక్షల కోట్ల అప్పులకు ఎలా చేరుకుందన్నారు. రెప్పపాటు కరెంట్ కోతలు లేవని చెప్పి.. డిస్కంలను రూ.26 వేల కోట్ల అప్పుల్లోకి ఎందుకు నెట్టినట్లు..? నిలదీశారు.
భూపాలపల్లి ప్లాంట్ ప్రారంభించింది వైఎస్ఆర్ అని.. జైపూర్, భద్రాద్రి ప్లాంట్లకు బీజం వేసింది కూడా ఆయనేనని షర్మిల అన్నారు. ఐదేళ్లలో వైఎస్ఆర్ 40 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తే.. 9 ఏళ్లలో లక్ష ఇళ్ల కట్టలేకపోయారని అన్నారు. 1.30 లక్షల మందికే ఈ దఫా దళితబంధు ఇస్తే.. మిగతా 18 లక్షల కుటుంబాల ఆత్మగౌరవం ఎక్కడ పోయినట్లు..? అని ప్రశ్నించారు. జలయజ్ఞం ప్రాజెక్టులను సొంత ప్రాజెక్టులుగా చెప్పుకోడానికి కేసీఆర్‌కి సిగ్గుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"ఆనాడు 30 లక్షల ఎకరాలకు తడిపిన ఘనత వైఎస్‌ఆర్‌ది. డిజైన్ మార్చి లక్ష కోట్లకు పెంచి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని కాళేశ్వరం కట్టి మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది. పాలమూరు-రంగారెడ్డికి దిక్కులేదు.. సీతారామ ప్రాజెక్ట్ పత్తా లేదు.." అని షర్మిల మండిపడ్డారు. పంట నష్టం కింద రూ.14 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావట్లేదన్నారు. పత్తి వేయించి రైతులను నిండా ముంచింది నిజం కాదా..? అని నిలదీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి