బీజింగ్: చైనాలోని హునన్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఓ బస్సుకు నిప్పంటుకున్న ఘటనలో 26 మంది దుర్మరణంపాలయ్యారు. స్థానిక అధికారవర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో గాయపడిన మరో 28 మందిని సమీపంలోని మూడు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా వున్నట్టు చైనా అధికారిక మీడియా సంస్థ జిన్‌హువా పేర్కొంది. హెనాన్ ప్రావిన్స్ నుంచి వస్తోన్న బస్సు హైవేపై ప్రయాణిస్తుండగా చాంగ్డె పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 59 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 53 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక టూర్ గైడ్ ఉన్నారు. 


ప్రమాదం అనంతరం ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. చైనాలోని ఓ రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించి 64 మంది చనిపోగా మరో 640 మంది తీవ్రంగా గాయపడిన దుర్ఘటన మరువకముందే ఈ ప్రమాదంలో ఇలా 26 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్‌కి గురిచేసింది.