ఆప్ఘనిస్తాన్‌‌లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం దేశ రాజధాని కాబుల్‌లో ఆఫ్ఘానిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమీపంలో తుపాకీ చప్పుళ్లు వినిపించాయని పోలీసు అధికారులు తెలిపారు.  దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాజిబ్ దానిష్ తుపాకీ కాల్పులు జరిగినట్లు ధ్రువీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ కాల్పుల్లో ఎవరైనా మరణించారా లేదా గాయపడ్డారా అనే విషయాలు ఇంకా తెలియరాలేదని అధికార ప్రతినిధి తెలిపారు. అంతర్గత వ్యవహారాల భవనం సమీపంలో తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మంత్రిత్వ శాఖ వైపు వెళ్లే రహదారుల్ని భద్రతా దళాలు మూసేశాయి.


అటు దక్షిణ ఆప్ఘనిస్తాన్‌లోని పులి అలంలో ఓ తాలిబాన్ పేలుడు పదార్థాలున్న వాహనంతో పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో 8 మంది పౌరులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.


మరోవైపు కందహార్ నగరంలోని ఓ గ్యారేజ్‌లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు మెకానిక్‌లు చనిపోగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని భద్రతాదళాలు వెల్లడించాయి.


ఆఫ్ఘనిస్తాన్‌లోని దక్షిణ రాష్ట్రం హెల్మంద్‌లో 50 మంది సీనియర్ తాలిబాన్ కమాండర్లు సమావేశం అయిన సమయంలో ఫిరంగులతో దాడి చేసి వారందరినీ మట్టుబెట్టినట్లు అమెరికా అధికార ప్రతినిధి తెలిపారు.