'కరోనా వైరస్'.. అమెరికాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ అతి దారుణంగా  దెబ్బతిన్న దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే కావడం విశేషం. చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఆ దేశం కంటే అమెరికానే ఎక్కువదా దెబ్బతీసింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతిని అడ్డుకోలేకపోతున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. చిర్రుబుర్రులాడుతున్నారు. ఆయనకు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHOపై ఆయన రుసరుసలాడుతున్నారు. కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాలను ముందస్తుగా WHO హెచ్చరించలేదనేది ఇందుకు కారణం. మరోవైపు అమెరికా నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపి వేస్తున్నట్లు తాజాగా నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. 


అంతే కాదు నిధులు ఆపివేయాలని అధికారులను ఆదేశించిన ట్రంప్.. నేరుగా ఇతర దేశాలతో కలిసి ప్రపంచ ఆరోగ్యానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. WHO.. తన ప్రామాణిక విధుల్లోనే వైఫల్యం చెందిందనేది అమెరికా అధ్యక్షుని వాదన. కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలకు ఎదురయ్యే ముప్పును WHO పసిగట్టలేదని ట్రంప్ విమర్శించారు. దీనికి ఆ సంస్థ మూల్యం  చెల్లించుకోవాల్సిందేనని తెలిపారు.


WHO ముందస్తుగానే ప్రమాదాన్ని అంచనా వేసి ఉంటే బాగుండేదని అన్నారు ట్రంప్. చైనాకు వైద్య నిపుణులను పంపి ప్రమాదాన్ని పసిగట్టి ఉండాల్సిందన్నారు. అలా చేసి ఉంటే వేలాది ప్రాణాలు కాపాడి ఉండే అవకాశం ఉండేదన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలేదని కాదని స్పష్టం చేశారు. అంతే కాకుండా చైనా ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలను ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణలోకి తీసుకుందని.. పరోక్షంగా చైనా ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిందని విమర్శించారు.  
 
ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నుంచే అత్యధిక నిధులు సమకూరుతున్నాయి. ఏటా 400 మిలియన్ డాలర్లను అమెరికా సమకూరుస్తోంది. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక బడ్జెట్ లో 15 శాతం నిధులను అమెరికా నుంచే సమకూరుతున్నాయన్నమాట. కరోనా వైరస్  వేగంగా విస్తరించడంతో అమెరికాలో అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 5 లక్షల 90 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 25 వేల మంది మృతి చెందారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..