పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరైన భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఒక శాంతిదూతని.. ఇరుదేశాల మధ్య శాంతిని కాంక్షించి మాత్రమే తన వద్దకు వచ్చారని.. అలాంటి వ్యక్తిని కొందరు భారతీయులు నిందించడం సరికాదని ఆయన అన్నారు. "ఆయనను నిందించే వారు శాంతి అనే పదాన్ని అగౌరవపరుస్తున్నారని నేను భావిస్తున్నాను. శాంతి స్థాపన అనేది జరగకపోతే ఏ దేశంలోని ప్రజల కూడా అభ్యుదయ మార్గంలో పయనించలేరు. సిద్ధూ ఒక  శాంతిదూతగా నా దగ్గరకు వచ్చారు. ఆయనను మీరు అనవసరంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు" అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బలపడాలంటే కూర్చొని చర్చల ద్వారా పలు సమస్యలను పరిష్కరించుకోవాలి. అందులో ముఖ్యమైన కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించడంలో కూడా ఇరు దేశాలు తమ అభిప్రాయలను పంచుకోవాలి. అలాగే ఇరు దేశాలు పేదరిక నిర్మూలనకు కూడా పాటుపడాలి. వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకోవాలి" అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. 


ఇమ్రాన్ ఖాన్ స్టేట్‌మెంట్ వెలువడక ముందే నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా తనపై వస్తున్న వివాదాలపై స్పందించారు. తాను ఒక స్నేహితుడిగా మాత్రమే ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం మేరకు ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యాను తప్పితే.. తాను ఓ రాజకీయ నాయకుడిగా వెళ్లలేదని తెలిపారు. అలాగే తాను పాకిస్తాన్ ఆర్మీ అధిపతిని చాలా భావోద్వేగపరమైన క్షణాల్లో మాత్రమే కౌగలించుకోవడం జరిగిందని.. ఆయన గురు నానక్ జయంతి సందర్భంగా సిక్కుల కారిడర్ ప్రారంభం గురించి చెప్పినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని సిద్ధూ తెలిపారు.