యాపిల్ నుంచి డ్యూయల్ సిమ్ ఫోన్లు
ఈ-సిమ్‌తో ఇకపై నెట్‌వర్క్ మారడం చాలా ఈజీ
ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏటా సెప్టెంబర్‌లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే యాపిల్ అందులో భాగంగా కుపర్‌టినో యాపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా బుధవారం రాత్రి (12.09.18)10 గంటల సమయంలో సరికొత్త వాచ్, ఫోన్లను విడుదల చేసింది.
యాపిల్ తొలిసారిగా డ్యూయల్ సిమ్ ఫోన్ మోడళ్ళు విడుదల చేసింది. డ్యూయల్ సిమ్ కలిగిన iPhone X(S), iPhone X(R) మొబైల్స్‌ను, యాపిల్ వాచ్ S4ను ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ ఆవిష్కరించారు. ఇందులో ఒకటి మామూలు సిమ్‌గా ఫోన్లో వేసుకొనే వీలుండగా రెండోది eSIM (నానో సిమ్ కన్నా మరీ చిన్నగా ఓ బుల్లి చిప్ రూపంలో eSIM ఉంటుంది. eSIMతో నెట్ వర్క్ ప్రొవైడర్‌ను మార్చడం తేలిక. మనం ఉన్నచోట నుంచే ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌లోకి మారవచ్చు. విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నెట్వర్క్‌లోకి మారడం సులభం. అయితే దీన్ని మార్చడం లేదా తీయడం అసాధ్యం). ఎయిర్‌టెల్, వొడాఫోన్, జియోలాంటి కొన్ని కంపెనీలు మాత్రమే ఈ సిమ్‌లను అందిస్తున్నాయి.
సైజులో తేడాతో విడుదలైన ఐ ఫోన్ ఎక్స్ ఎస్ ప్రారంభ ధర $999, ఎక్స్ ఎస్ మ్యాక్స్ $1099. యాపిల్ తాజాగా విడుదల చేసిన ఐ-ఫోన్ మోడల్స్‌ను డ్యూయల్ సిమ్‌తో పాటు పలు అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు.
5.8"(ఐ-ఫోన్ ఎక్స్ ఎస్), 6.5" (ఐ-ఫోన్ ఎక్స్ ఎస్ మ్యాక్స్), 6.1"( ఐ-ఫోన్ ఎక్స్ ఆర్) ఓఎల్‌ఈడీ తెర, 12మెగా పిక్సల్ వెనక డ్యూయల్ కెమెరాలు, 7 మెగా పిక్సల్ ముందు కెమెరా, ఏ12 బయోనిక్ చిప్, డ్యూయల్ సిమ్, ఐఓఎస్ 12, వాటర్ రెసిస్టెంట్‌తో పాటు స్టీరియో సౌండర్, బయో మెట్రిక్ ద్వారా ముఖాన్ని గుర్తించే అత్యాధునిక ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి. లేటెస్ట్ ఐ-పోన్ మోడల్స్ అన్నీ 64 జీబీ, 256 జీబీ, 512 జీబీ సామర్థ్యంతో లభించనుండగా.. భారత మార్కెట్‌లో ఈ ఫోన్లు రూ.71,800 నుంచి రూ.లక్షా పదివేల ధర పలకనున్నాయి. లేటెస్ట్ ఐ-ఫోన్ల బుకింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుండగా.. భారత మార్కెట్‌లో ఈ నెల 28 నుంచి అందుబాటులోకి రానున్నాయి. లేటెస్ట్ ఐ-ఫోన్లు సిల్వర్, గ్రే కలర్స్, గోల్డ్ కలర్‌లో లభించనున్నాయని తెలిసింది.