టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తమ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ అంతర్గత సమాచారాన్ని కొందరు ఉద్యోగులు బయటపెడుతున్నారని.. అలాంటి ప్రయత్నాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ స్పష్టం చేసిందని నివేదికలు తెలిపాయి. సంస్థ ఉద్యోగులు సమాచారాన్ని లీక్ చేయడం మానుకోవాలని ఆపిల్ సంస్థ హెచ్చరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది కంపెనీ అంతర్గత సమాచారాన్ని బయటపెట్టిన 29 మంది ఉద్యోగులను గుర్తించామని యాపిల్ సంస్థ తెలిపింది. వీరిలో 12 మంది ఉద్యోగులను పోలీసులకు అప్పగించామని సంస్థ పేర్కొంది. ఉద్యోగులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కంపెనీ స్పష్టం చేసింది.


యాపిల్ ఒక్కటే కాదు.. ఇదే బాటలో అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వార్నింగ్‌లు ఇస్తున్నాయి.  ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు సంస్థలు తమ అంతర్గత సమాచార లీకేజీలపై ఉద్యోగులకు సీరియస్ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. సంస్థ అంతర్గత విషయాలను లీక్ చేసిన వారిని ఉద్యోగం నుండి తీసివేయడమేకాక, జైలుకు పంపడం,భారీ జరిమానా విధించడం లాంటి శిక్షలు విధిస్తున్నాయి. అలాగే ఈ విధంగా చేస్తే మరో కంపెనీలో  ఉద్యోగం దొరకడం కూడా చాలా కష్టమవుతుందని ఉద్యోగులకు జారీ చేసిన మెమోలో యాపిల్ సంస్థ పేర్కొంది. కొన్ని సంస్థల్లో సమాచారాన్ని లీక్ చేసిన ఉద్యోగులు జైలు జీవితం గడుపుతున్నారన్న విషయాన్ని కూడా ఆపిల్ కంపెనీ గుర్తు చేసింది.


యాపిల్‌ ఇలా హెచ్చరికలు జారీచేయడం ఇదేం మొదటిసారికాదు. ఐఫోన్‌ ఎక్స్‌ ఫోన్‌ లాంచింగ్ సమయంలో, ఆ లేటెస్ట్‌ ఫ్లాట్‌షిప్‌ గురించి పలు కీలకమైన వివరాల్ని ఓ ఉద్యోగి లీక్‌ చేశాడు. ఆ సమయంలో కూడా యాపిల్‌  ఇదే తరహాలో హెచ్చరికలు జారీచేసింది.