అమెరికా ఎయిర్‌పోర్టులో కెనడా మంత్రికి అవమానం..!
కెనడా దేశ క్యాబినెట్ మంత్రి నవదీప్ బెయిన్స్‌కి అమెరికా ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. విమానం ఎక్కే ముందు జరిగే సెక్యూరిటీ చెక్‌లో ఆయన పట్ల సిబ్బంది అనుచితంగా వ్యవహరించారు.
కెనడా దేశ క్యాబినెట్ మంత్రి నవదీప్ బెయిన్స్‌కి అమెరికా ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. విమానం ఎక్కే ముందు జరిగే సెక్యూరిటీ చెక్‌లో ఆయన పట్ల సిబ్బంది అనుచితంగా వ్యవహరించారు. నవదీప్ సిక్కు కాబట్టి తలపాగా ధరించి ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగా.. ఆ తలపాగాని తొలిగించాలని సిబ్బంది తెలిపారు.
కెనడా ప్రభుత్వంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నవదీప్ అమెరికాకి ఒక అధికారిక పని మీద వచ్చి తిరిగి తన స్వదేశానికి వెళ్తున్న క్రమంలో ఆ ఘటన చోటు చేసుకుంది. అయితే తాను వీఐపీ అన్న విషయం తెలియగానే సిబ్బంది మళ్లీ తలపాగాతో అనుమతించారని మంత్రి తెలిపారు.
ఈ విషయాన్ని ఆయన కెనడాలోని అమెరికన్ అంబాసిడర్‌కు తెలియజేశారు. ఈ క్రమంలో అమెరికన్ ప్రభుత్వం కెనడా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది.ఈ క్రమంలో మంత్రి నవదీప్ బెయిన్స్ మాట్లాడుతూ "ఒక సిక్కుగా తలపాగా ధరించడం అనేది నా నమ్మకానికి, నా మత గౌరవానికి సంబంధించిన విషయం. దానిని నేను పాటించాల్సిందే. అలా పాటిస్తున్నందుకు నేను గర్వపడతాను. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు నిబంధనలను సడలించాలి. మా ప్రభుత్వం కచ్చితంగా ఇలాంటి విషయాలలో బాధ్యతగా ఉంటుంది. అన్ని మతాలను అందరూ గౌరవిస్తే బాగుంటుంది." అని తెలిపారు.