ఉత్తరకొరియాకి వెళ్లనున్న చైనా రాయబారి
ఈ నెల 17వ తేదీన చైనా అధికారిక రాయబారిగా సోంగ్ తావో ఉత్తర కొరియా ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య అణు చిచ్చు రగులుతున్న సమయంలో చైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పలువురిని ఆశ్చర్యపడేలా చేసింది. ఈ పర్యటన విషయాన్ని ఇటీవలే చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా ప్రకటించింది. ఇటీవలే ఆసియా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడిని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక మంత్రిస్థాయి అధికారి అయిన సోంగ్ తావో, ఉత్తర కొరియాకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. చైనా అధ్యక్షుడి సూచనల మేరకు ఈ పర్యటనను చేపట్టిన సోంగ్ తావో, అక్కడ ఎలాంటి విషయాలపై చర్చిస్తారన్న అంశంపై ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం దాదాపు 90 శాతం వ్యాపార లావాదేవీలను ఉత్తర కొరియా, చైనాతోనే చేస్తోంది. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్న దేశాలన్ని పర్యటిస్తున్న చైనా ప్రతినిధులు వియత్నాం, లావోస్ తర్వాత ఇప్పుడు ఉత్తర కొరియాలో పర్యటించాలని భావిస్తున్నారు.
అయితే ఈ పర్యటనలో చైనా రాయబారి సోంగ్ తావో, ఉత్తర కొరియా ప్రధాని కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ అవుతారా లేదా.. అన్న విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ భేటీ అయితే కొరియా అసురిస్తున్న న్యూక్లియర్ పద్ధతులపై ఎలాంటి విషయాలు చర్చిస్తారు అన్నది కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ఇటీవలే కిమ్, చైనా అధ్యక్షుడికి తన శుభాకాంక్షలు తెలిపారు. వారి మధ్య ఉన్న స్నేహాన్ని కొనియాడారు. ఇప్పటికే ఉత్తర కొరియాకి చైనా ఆయుధాలు సమకూరుస్తుందన్న అనుమానంతో ఉన్న అమెరికా మరి ఈ విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పందననూ తెలియజేయలేదు. ప్రస్తుతం చైనా రాయబారిగా ఉత్తర కొరియాను సందర్శిస్తున్న సోంగ్ తావో "ఇంటర్నేషనల్ డిపార్టుమెంటు ఆఫ్ ది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా"కు నాయకుడిగా కొనసాగుతున్నారు. చైనా రాజకీయాల్లో తిరుగులేని పాత్రను కూడా పోషిస్తున్నారు. ఆయన పర్యటన ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి సంచలనం నమోదు చేస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.