బీజింగ్: చైనాలో విషాదం చోటుచేసుకుంది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అందరి కంటే ముందుగా గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ మృతిచెందారు. ఆయన గుర్తించి, ప్రభుత్వాన్ని సైతం దీనిపై హెచ్చరించిన డాక్టర్‌ను చివరికి అదే వైరస్ పొట్టన పెట్టుకోవడం చైనాలో కలకలం రేపుతోంది. లీ వెన్లియాంగ్ శుక్రవారం వేకువజామున వుహాన్ సెంట్రల్ హాస్పిటల్‌తో చికిత్స పొందుతూ చనిపోయారని అధికారులు ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు విశేషంగా సేవలందిస్తున్న కంటి వైద్యుడు లీ వెన్లియాంగ్ ఆ ప్రమాదకర వైరస్ బారిన పడి చనిపోయారని పేర్కొన్నారు. లీ వెన్లియాంగ్ మరణవార్త బయటకు రాగానే చైనా ప్రజలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో ఈ కంటి డాక్టర్ సార్స్ లాంటి ప్రమాదకర వైరస్‌ను తాను గుర్తించానని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


34 ఏళ్ల లీ వెన్లియాంగ్ సార్స్ తరహా వైరస్ విజృంభిస్తోందని మెడికల్ స్కూల్ ఆలమ్నీ జర్నల్‌లో తెలిపారు. వుయ్ చాట్ ద్వారా కొన్ని మెడికల్ గ్రూపుల్లో పోస్ట్ చేసి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కొందరు పేషెంట్లను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని తాను ధృవీకరించినట్లు కంటి డాక్టర్ లీ వెన్లియాంగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో పోస్టులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడని సైతం ఆయనను అరెస్ట్ చేయడం గమనార్హం. 


వైరస్‌ను ఇతర డాక్టర్లు నిర్ధారించిన తర్వాత లీ వెన్లియాంగ్‌ను విడుదల చేశారు. ఈ నెల 1వ తేదీన ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన వుహాన్ వైద్యులు చికిత్స అందించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కాగా, లీ వెన్లియాంగ్ భార్య ప్రస్తుతం గర్భవతి. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు నెగిటివ్‌గా తేలిందని చెప్పారు. కానీ భర్త మరణాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది. మరోవైపు ఆమెకు కూడా కరోనా నిర్ధారణయ్యే అవకాశాలున్నందున ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..