ఈ రోజు ఉదయమే ఓ ఘోర ప్రమాద వార్త అంతర్జాతీయ మీడియాని మొత్తం తట్టి లేపింది. 181 ప్రయాణికులతో బయలుదేరిన ఇండోనేషియాలోని లయన్ విమానయాన సంస్థకు చెందిన 'జేటీ 610' విమానం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఈ విమానానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ విమానాన్ని నడిపింది ఓ భారతీయుడు కావడం గమనార్హం. ప్రమాదం జరిగినప్పుడు ఆ విమానానికి..  ఢిల్లీకి చెందిన భవ్యే సునేజా పైలట్‌గా వ్యవహరించారు. ఈ ప్రమాద వార్త తెలియగానే రాజధానిలో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో స్కూలింగ్ చేసిన సునేజా.. 2009లో బెల్ ఎయిర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్కూల్ నుండి కమర్షియల్ పైలట్ లైసెన్స్ తీసుకున్నారు. తర్వాత ఎమిరేట్స్‌లో కొన్నాళ్లు ట్రైనీగా కూడా పనిచేశారు. 2011లో ఇండోనేషియాకి వెళ్లి అక్కడి ఎయిర్ లైన్స్‌లో చేరారు. ఈ రోజు ప్రమాదం జరిగిన విమానానికి ఆయనే పైలట్‌గా ఉన్నారు. అయితే సునేజా చాలా అనుభవం ఉన్న పైలట్ అని ఆయనతో పనిచేసిన వారు చెబుతున్నారు. 


ఇండోనేషియాలోని లయన్ విమానయాన సంస్థకు చెందిన 'జేటీ 610' విమానం సోమవారం (అక్టోబరు 29) ఉదయం బయలుదేరిన కొద్ది సేపటికే కుప్పకూలింది. ఈ విమానంలో 181 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలెట్లు,   అయిదుగురు సిబ్బంది కూడా ఉన్నారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోవడమే ఈ విమాన ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.తొలుత కానరాకుండా పోయిన ఈ విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లు ఇండోనేషియా మీడియా ఇప్పటికే వెల్లడించింది.