అమెరికాలో వున్న తెలుగు ఎన్నారైలకు ఓ బ్యాడ్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత అమెరికాలో పనిచేసుకుంటున్న విదేశీయులకి ఎప్పటికప్పుడు ఓ చేదు వార్త వినిపిస్తూనే వుంది. అలాగే తాజాగా హెచ్1బి వీసాపై అమెరికాలో ఉపాధి పొందుతున్న వారికి మరో షాక్ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం రెడీ అయ్యింది.  హెచ్1బి వీసాపై ఉపాధి పొందుతున్న వారి జీవిత భాగస్వామికి ఇకపై అమెరికాలో పనిచేసే అర్హతలు లేకుండా చేసే పాత చట్టాన్ని మళ్లీ అమలు చేసేందుకు అమెరికా సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం హెచ్1బి వీసాపై పనిచేస్తోన్న వారి జీవిత భాగస్వామి అమెరికాలో ఉపాధి పొందే వీలు కల్పిస్తూ ఆదేశాలు జారిచేసింది. ఈ ఆదేశాల ప్రకారం హెచ్-4 డిపెండెంట్ వీసాపై అమెరికాలో వున్నప్పటికీ, కొన్ని షరతులకి లోబడి ఉద్యోగం చేసుకునే అవకాశం హెచ్ 1బీ వీసా హోల్డర్స్ కి ఉంది. 


ఇదిలావుంటే, గురువారంనాడు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యురిటీ విభాగం విడుదల చేసిన ప్రకటన సారాంశం ప్రకారం ఇకపై హెచ్1బీ వీసా హోల్డర్స్ జీవిత భాగస్వామికి అమెరికాలో ఉపాధి పొందే అవకాశం ఉండదు. అమెరికా సర్కార్ తాజా ప్రతిపాదన అమలులోకి వస్తే, ఇకపై అమెరికాలో వున్న హెచ్ 1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. అదే కానీ జరిగితే, ఆర్థికంగా అది వారికి కోలుకోని దెబ్బే అవుతుంది.