కాంగోను కబళిస్తున్న ఎబోలా
ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ఎబోలా వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది.
ఆఫ్రికా: ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ఎబోలా వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. ఎబోలా వైరస్ కారణంగా కాంగోలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఒకరి మృతితో మొదలైన వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోందని.. ఆదివారం వరకు వైరస్ బారిన పడి 26 మంది మృత్యువాతపడ్డారని అధికారులు వెల్లడించారు. పరిస్థితి విషమిస్తుండటంతో అధ్యక్షుడు జోసెఫ్ కబిలా రూ.27కోట్లను ఎబోలాను అరికట్టడానికి కేటాయించారు.
ఈ ప్రాణాంతక వ్యాధి కాంగోను 1976 నుంచి వణికిస్తోంది. ఇది క్రమంగా ప్రపంచ దేశాలకు వ్యాపించి ప్రజలను ఆందోళనలకు గురిచేస్తోంది. ఈ వ్యాధిని తొలిసారిగా జైర్ ప్రాంతంలో బెల్గెన్ నేతృత్వంలోని బృందం కనుగొన్నది. ఎబోలా మళ్లీ విజృంభించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) కాంగో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. 2017లో డబ్ల్యూహెచ్‌ఒ అప్రమత్తమై సరైన చర్యలు తీసుకోవడంతో ఎబోలా వ్యాధిని నియంత్రించగలిగారు. కాగా 50 మంది ప్రత్యేక వైద్య నిపుణులను కాంగోకు పంపినట్లు డబ్ల్యూహెచ్ఒ ఓ ప్రకటనలో తెలిపింది.