మెట్రోస్టేషన్లో అదుపు తప్పిన ఎస్కలేటర్, పలువురు ప్రయాణికులకు గాయాలు
నిత్యం రద్దీగా ఉండే ఆ మెట్రో స్టేషన్‌లో ఎస్కలేటర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. నిర్దేశిత వేగం కంటే అధిక వేగంతో కదలడంతో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో 20 మంది వరకు గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటన ఇటలీ రాజధాని రోమ్ నగరంలో చోటు చేసుకుంది.
అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం నిర్దేశిత వేగంతో కదులుతున్న ఎస్కలేటర్ ఆకస్మాత్తుగా వేగం పుంజుకుంది. ఎస్కలేటర్ కదిలే వేగానికి దానిపై ఉన్న ప్రయాణికులు విసిరేసినట్టుగా ఒకరిపై ఒకరు పడ్డారు. ఫలితంగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా స్థానికంగా ఉన్న ఓ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా ఘటనపై మెట్రో అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాద ఘటన కంటే ముందు తప్పతాగిన కొందరు ఆకతాయిలు ఎస్కలేటర్‌పై గంతులు వేశారని..అందుకే అది అదుపు తప్పి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా తాజా ఘటనపై ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.