ఫేస్‌‌బుక్‌పై హ్యాకర్ల దాడి జరిగింది. ఫేస్‌బుక్‌లోని ఓ లోపాన్ని ఆయుధంగా చేసుకొని హ్యాకర్లు ఏకంగా 50 మిలియన్ల ఖాతాల వివరాలను దొంగలించారు. దాదాపు 5 కోట్ల మంది ఖాతాలు హ్యాక్‌ అయినట్లు ఫేస్‌బుక్‌ సంస్థ శుక్రవారం వెల్లడించింది. ఈ విషయాన్ని గ్రహించిన వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఫేస్‌బుక్‌ సీఈఓ జుకర్ బర్గ్ తెలిపారు. కొంతకాలంగా హ్యాకర్లు ఫేస్‌బుక్‌పై దాడులకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారిని కట్టడిచేసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు.



అప్లికేషన్‌లో.. ఒకరి ప్రొఫైల్‌లో ఇతరులను పోలి ఉన్న అంశాలను చూపించే  'వ్యూ యాజ్‌’ అనే ఫీచర్‌లోని సాంకేతిక లోపాన్ని ఉపయోగించి హ్యాకర్లు చోరీకి పాల్పడి ఉండవచ్చని అభిప్రాయపడింది. హ్యాక్‌కు గురైన ఫీచర్‌ను నిలిపివేశామని, హ్యాక్ అయిన వెంటనే ఖాతాలను లాగ్ ఔట్ చేయాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసినట్లు ఫేస్‌బుక్‌ సంస్థ ప్రకటించింది. ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకుంటామని, ఆందోళన పడవలసిన అవసరం లేదని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. కాగా ఈ 5 కోట్ల సమాచారాన్ని దుర్వినియోగం చేశారా?లేదా? అన్నది తెలియాల్సి ఉంది.