కొరియా సమస్యకు పరిష్కారం దొరికేనా..?
ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం...ఇప్పటి వరకు క్షిపణుల ప్రయోగాలు చేస్తుంటే అమెరికాతో బేరసారాల కోసమనుకున్నాం..అయితే ఇప్పడు ఏకంగా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగించి యుద్ధానికి సై అంటూ సవాల్ విసురుతోంది. ఓ చిన్న సాధారణ దేశం.. అగ్రరాజ్యమైన అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలతో పాటు ఐరోపా దేశాలను లెక్కచేయకుండా ఇంతటి దూకుడు వైఖరి ప్రదర్శిస్తుందంటే..తన సొంత వైఖరిని ప్రదర్శిస్తుందా.. లేక ఏదైన బలమైన శక్తి అండతో ఇలా వ్యవహరిస్తోందా ?.. అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి...ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టాలంటే కొరియా దేశాల మధ్య ఇంతటి వైరమెందుకు వచ్చింది..ఈ రెండు దేశాలకు ఎవరి అండదండలున్నాయి..ఎవరి పాత్ర ఏమిటనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంది. అప్పుడే దీనికి పరిష్కారం వెతకడం సులభతరమౌతుంది.
కొరియా దేశాల మధ్య ఇంతటి వైరమెందుకు ?
వాస్తవానికి రెండో ప్రపంచ యుద్దం తర్వాత అప్పటి వరకు జపాన్ ఆధీనంలో ఉన్న కొరియా రెండు ముక్కలై 1948లో రెండు దేశాలుగా ఏర్పడింది. ఉత్కర కొరియా భాగం రష్యా ఆధీనంలోకి రాగా..దక్షిణ కొరియా అమెరికా ఆధీనంలోకి వచ్చింది. ఉత్తర కొరియా రష్యా ప్రభావంతో సోషలిస్టు రాజ్యంగా ఆవిర్భవించగా, దక్షిణ కొరియా అమెరికా ప్రభావంతో పెట్టుబడిదారీ వ్యవస్థను అనుసరించింది. దక్షిణ కొరియా అమెరికా, జపాన్ నుంచి లభించిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా అభివృద్ధి సాధించింది. అదే సమయంలో ఉత్తర కొరియా ప్రపంచదేశాలతో మమేకం కాలేక వెనుకబడిపోయింది. దీంతో దక్షిణ కొరియా తమ అవకాశాలను దెబ్బకొడుతుందనే విశ్వాసం నార్త్ కొరియా ప్రజల్లో ఏర్పడింది. దీనికి తోడు ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య ఉంది.
1948లో ఉత్తర కొరియా దేశం ఆవిర్భావం సమయంలో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా నాయకుడైన కిమ్ సంగ్ రష్యాతో మద్దతో దేశ అధ్యక్షడయ్యాడు. ఆయన 1994 వరకు సుదీర్ఘంగా పాలించాడు. అతని అనంతరం 1994 నుంచి 2012 వరకూ కిమ్ జాంగ్.. ఆ తర్వాత ప్రస్తుత కిమ్ జాంగ్ ఉన్న అధ్యక్షులయ్యారు. కింగ్ జాంగ్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి యుద్ధ కాంక్షను ప్రదర్శిస్తూ వచ్చాడు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి అంశాలను పక్కన పెట్టి సైన్యం బలోపేతం చేయడం, ఖండాతర క్షిపణులు అభివృద్ధి చేయటంపైనే దృష్టి సారిస్తున్నాడు. నాయకుడి వైఖరి కూడా ఘర్షణ వాతావరణానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
అగ్గి రాజుకుందిలా...
వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతోంది. ఫలితంగా ప్రపంచ చిత్రపటం నుంచి దక్షిణ కొరియాను లేకుండా చేస్తామని ఉత్తర కొరియా భీషణ ప్రతిజ్ఞ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య లౌడ్ స్పీకర్లు తాజాగా చిచ్చురేపాయి. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా దేశ సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్లతో దుష్ప్రచారం చేస్తుండగా, దీనిపై నార్త్ కొరియా మండిపడుతోంది. నిజానికి అమెరికా - దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంపై ఉత్తర కొరియా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్లతో ప్రచారం చేయడాన్ని నార్త్ కొరియా అదునుగా తీసుకుంది ఫలితంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగిస్తోంది. దీనికి సౌత్ కొరియా కూడా ధీటుగానే స్పందించింది. సరిహద్దుల్లో యుద్ధానికి సన్నద్ధమై ఉండాలంటూ నార్త్ కొరియా సుప్రీం కిమ్‌జోంగ్ ఉన్ తన సైన్యానికి ఆదేశాలు జారీచేశారు.
చైనా, రష్యా పాత్ర ...
చైనా తలుచుకుంటే ఉత్తర కొరియాను అదుపు చేయగలదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంతో కాలంగా చెబుతున్నారు. కానీ దానికి చైనా నుంచి సానుకూల స్పందన కనిపించటం లేదు. ఇంతకాలం ఉత్తర కొరియాకు అన్నీ తానై వ్యవహరించటమే దీనికి కారణం. ఆ దేశ వాణిజ్యంలో చైనా వాటా 90 శాతం ఉంది. అన్ని రకాలైన వస్తువులను, ఆయుధాలను చైనా సరఫరా చేస్తోంది. తూర్పు ఆసియాలో అమెరికా ప్రభావం ఇంకా విస్తరించి తనదాకా రాకుండా ఉండాలంటే అడ్డుగా ఉత్తర కొరియా వంటి దేశం ఉండటం అవసరమని చైనా భావిస్తోంది. అందుకే ప్రస్తుత వివాదంలో గుంభనంగా వ్యవహరిస్తోంది.
ఉత్తర కొరియాను సృష్టించటంలో అసలు పాత్ర రష్యాదే అయినా తర్వాత కాలంలో ఆ దేశ వ్యవహారాల్లో చైనా క్రియాశీలకంగా మారింది. అయినప్పటికీ చైనాకు ఉన్న భయాలే రష్యాకూ ఉన్నాయి. అందువల్ల ఈ రెండు దేశాలు ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు ప్రయత్నించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
అగ్రరాజ్యల జోక్యం తగదు..
ప్రపంచ ఆదిపత్యం కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కొరియా దేశాలను అగ్రరాజ్యాలైన ఆమెరికా,చైనాలు .. కొరియా దేశాలను పావుగా వాడుకుంటున్నాయనేది విశ్లేషకులు అభిప్రాయం. ఇలాంటి వైఖరి వల్లే కొరియా దేశాల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడిందనే భావన మేధావుల్లో ఉంది. ఈ రెండు దేశాల్లో విషయంలో అగ్రరాజ్యాల జోక్యం చేసుకుండా ఉంటే సగం సమస్య తీరినట్లే. దీనితో పాటు ఇరు దేశాల మధ్య శాంత స్థాపన కోసం ఐక్యరాజ్య సమితి ప్రధాని భూమిక పోషించాల్సి ఉంది. ఇరు దేశాలు అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై దష్టి సారించనట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.