22వ పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నిక
పాకిస్తాన్‌లో శుక్రవారం దిగువ సభలో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ ఇమ్రాన్‌కి 176 ఓట్లు పడగా, ప్రతిపక్ష పీఎమ్‌ఎల్-ఎన్ నేత షెహ్‌బాజ్‌కు 96 ఓట్లు పడ్డాయి.
పాకిస్తాన్‌లో శుక్రవారం దిగువ సభలో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ శాతం ఇమ్రాన్‌కి 176 ఓట్లు పడగా, ప్రతిపక్ష పీఎమ్‌ఎల్-ఎన్ నేత షెహ్‌బాజ్‌కు 96 ఓట్లు పడ్డాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఇక ప్రధాని పీఠం ఎక్కడం లాంఛనమే అని భావించవచ్చు. ప్రస్తుతం భారత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పాకిస్తాన్‌లోనే ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ నుండి వచ్చిన ఆహ్వానం మేరకు ఆయన బయలుదేరి వెళ్లారు. తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ నేతైన ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఇస్లామాబాద్ ప్రాంతంలోని ప్రెసిడెంట్ హౌస్‌లో జరగబోతోంది. ఎన్నికల అనంతరం నేషనల్ అసెంబ్లీ సభ్యులందరూ ప్రధాని మంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది సంప్రదాయం.
అయితే సర్కారును ఏర్పాటు చేయాలంటే మెజార్టీ శాతం ఓట్లు రావాలి. ఇమ్రాన్ విషయంలో అదే జరిగింది. 342 మంది పార్లమెంటు సభ్యుల్లో కనీసం 172 ఓట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే అనుకున్న సంఖ్య కంటే ఎక్కువగానే ఇమ్రాన్‌ఖాన్‌కు 176 ఓట్లు రావడంతో ఆయనే దాదాపు ప్రధానిగా ఎన్నికవ్వడం జరిగింది. దీంతో 22వ పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ శనివారం (ఆగస్టు 18న) ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రేపు జరగనుండడంతో పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ తన స్కాట్లాండ్ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే.. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈ నెల 11వ తేదినే జరగాల్సి ఉంది. అయితే.. పలు కారణాల వల్ల అది వాయిదా పడింది. ఆ తర్వాత పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆ కార్యక్రమం ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ ఆఫీసు తెలిపింది. కానీ అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు ఆఖరికి 18వ తేదిన ఈ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.