మల్దీవుల్లో 15 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించడంతో ఆ దేశ అంతర్గత పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా ఓ భారతీయ పాత్రికేయుడితోపాటు లండన్‌కి చెందిన మరో పాత్రికేయుడిని మాల్దీవుల పోలీసులు అరెస్ట్ చేయడం అక్కడి పరిస్థితులకు, మాల్దీవుల ప్రభుత్వం అభద్రతా భావానికి అద్దం పడుతోంది. మాల్దీవుల పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరిలో ఒకరిని పంజాబ్ లోని అమృత్ సర్ కి చెందిన మనీ శర్మగా గుర్తించగా లండన్ కి చెందిన పాత్రికేయుడిని అతీష్ రవ్జీ పటేల్ గా గుర్తించారు. ఈ ఇద్దరూ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీలో పాత్రికేయులుగా పనిచేస్తున్నారు. లండన్ కి చెందిన అతీష్ రజ్వి పటేల్ సైతం భారతీయ సంతతికి చెందిన వ్యక్తేనని తెలుస్తోంది. 


ఇమ్మిగ్రేషన్ విభాగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అనుమానంతో మాల్దీవుల జాతీయ అంతర్గత భద్రతా ప్రయోజనాల చట్టం కింద వారిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. అరెస్ట్ అనంతరం దర్యాప్తు నిమిత్తం ఆ ఇద్దరినీ ఇమ్మిగ్రేషన్ విభాగానికి అప్పగించారు. వీళ్ల అరెస్ట్‌ని మాల్దీవులలో వున్న భారత రాయబార కార్యాలయం సైతం ధృవీకరించింది. అరెస్ట్ వెనుక మరిన్ని కారణాలని తెలుసుకునేందుకు మాల్దీవులలోని భారత రాయబార కార్యాలయం అక్కడి జాతీయ దర్యాప్తు సంస్థలు, పోలీసులతో సంప్రదింపులు జరుపుతోంది.