కోల్‌కతా నుంచి త్రిపుర రాజధాని అగర్తలకు వెళ్తున్న ఇండిగో విమానం, అదే సమయంలో అగర్తల నుంచి కోల్‌కతాకు వస్తోన్న ఎయిర్ డెక్కన్‌ విమానం పరస్పరం సమీపంలోకి వచ్చి ఆ తర్వాత ప్రమాదం నుంచి బయటపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బంగ్లదేశ్ రాజధాని ఢాకా గగనతలంపై మే 2న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. కోల్‌కతా నుంచి త్రిపుర రాజధాని అగర్తలకు వెళ్తున్న ఇండిగో విమానం 6E892, అగర్తల నుంచి కోల్‌కతాకు వస్తోన్న ఎయిర్ డెక్కన్‌కి చెందిన DN 602 విమానం పరస్పరం సమీపంలోకి రావడం గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగం ఆ రెండు విమానాల పైలట్లను అప్రమత్తం చేసింది. ఏటీసీ సూచనలతో అప్రమత్తమైన పైలట్లు తమ విమానాల దిశ మళ్లించడంతో పెను ప్రమాదం తప్పిందని సమాచారం. 


రెండు విమానాలు సమీపంలోకి వచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య దూరం 700 మీటర్లు మాత్రమే వుంది. ఇది ఎయిర్ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) జరిగిన ఘటనపై విచారణ చేపట్టింది.