ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఈ నెల 15వ తేదీ నుండి భారత్‌లో సందర్శించనున్నట్లు సమాచారం. ఈ సందర్శన సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో పాటు పలువురు భారతీయ వాణిజ్యవేత్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత పెంచేందుకు.. ఈ క్రమంలో పలు ఒప్పందాలు చేసుకొనేందుకు ఈ సందర్శన దోహదపడుతుందనేది పలువురి అభిప్రాయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌కు ఇప్పటికే ఇరాన్‌తో పలు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఆయిల్, గ్యాస్ మొదలైనవి ఇరాన్ నుండి భారత్‌కు ఎగుమతి అవుతున్నాయి. అయితే.. ఇటీవలి కాలంలో ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మొత్తం ఏకమై.. సర్కారును పడకొట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో.. ఆ దేశ అధ్యక్షుడు భారత్‌ను సందర్శించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


ఈ సందర్శన సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు ప్రధానంగా చాబహర్  పోర్టు గురించి ప్రస్తావించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దక్షిణ తూర్పు ఇరాన్‌లో గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఉన్న పోర్టులో ఇప్పటికే కొంత మొత్తాన్ని భారత్ పెట్టుబడిగా పెట్టింది. అలాగే 150 మిలియిన్ డాలర్లను ఇరాన్‌కు లైన్ ఆఫ్ క్రెడిట్‌గా కూడా అందించింది. ఈ చాబహర్ పోర్టులో భారత్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా భాగస్వామిగా ఉండడం గమనార్హం. ఈ మూడు దేశాలు గతంలో ఈ పోర్టుకు సంబంధించిన ఎంఓయూ (ఒప్పందం) కూడా కుదుర్చుకున్నాయి.