జైల్లో నవాజ్ షరీఫ్‌కి కిడ్నీ ఫెయిల్..!
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉన్నట్టుండి కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో హుటాహుటిన సిబ్బంది ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉన్నట్టుండి కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో హుటాహుటిన సిబ్బంది ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. జైలు ఆసుపత్రిలో తొలుత ఆయనకు చికిత్స అందించాలని భావించినా.. అందుకు తగ్గ ఎక్విప్‌మెంట్, సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో షరీఫ్‌ను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఆయనను తరలించకపోతే.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని కూడా వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం రావల్పిండి అదియాలా జైలులో షరీఫ్ ఉన్నారు.
ఇటీవలే అక్రమాస్తుల కేసులో షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మరియమ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మాజీ ప్రధానికి 10 సంవత్సరాల జైలుతో పాటు 10 మిలియన్ డాలర్లను జరిమానాగా విధించగా.. మరియమ్‌కు 2.6 డాలర్లను జరిమానాగా విధించారు. అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన షరీఫ్.. ఆ డబ్బుతో లండన్ ప్రాంతంలోని అవెన్ ఫీల్డ్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
గతంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఉన్న షరీఫ్ మూడు పర్యాయాలు ఆ దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2017లో ఆఖరిసారి ఆయన ప్రధాని పీఠం నుండి తప్పుకున్నారు.పనామా పేపర్స్ కేసులో ఆయన గతంలో ప్రధానమంత్రి పదవి నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1) ప్రకారం ఆయన ఆ దేశంలో ఎలాంటి ఎన్నికలలోనూ పోటీ చేయకుండా ఉండాలని చెబుతూ.. పాక్ సుప్రీంకోర్టు జీవితకాలం నిషేధం విధించింది.