కాన్సులేట్‌లోనే ఖషోగ్గి మృతి: సౌదీ అరేబియా
కాన్సులేట్‌లోనే ఖషోగ్గి మృతి: సౌదీ అరేబియా
ఎట్టకేలకు సౌదీ అరేబియా జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి మృతిపై స్పందించింది. దీంతో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి అదృశ్యం కేసులో వస్తున్న వార్తలకు సౌదీ ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలోనే ఖషోగ్గి మరణించినట్లు సౌదీ తెలిపింది. కాన్సులేట్‌లో జరిగిన ఓ ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యులుగా అయిదుగురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారని సౌదీ టీవీ పేర్కొంది. రాజుకి వ్యతిరేకంగా వార్తలు రాశాడని, సౌదీ ప్రభుత్వమే కషోగ్గిని క్రూరంగా చంపించిందని టర్కీ ఆరోపణ. ఇదే నిజమైతే సౌదీకి కష్టాలు తప్పవని అమెరికా హెచ్చరించింది.
అక్టోబర్ 2వ తేదీన సౌదీ కాన్సులేట్‌కు వెళ్లిన ఖషోగ్గి ఆచూకీ దొరకలేదు. అదృశ్యమైన ఖషోగ్గిని సౌదీనే హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అమెరికా కూడా సీరియస్ అయి.. సౌదీపై ఒత్తిడి తెచ్చింది. మొదట్లో ఖషోగ్గి గురించి ఏమీ తెలియదని బుకాయించిన సౌదీ.. తాజాగా కాన్సులేట్‌లోనే మృతి చెందినట్లు పేర్కొంది. అమెరికా పౌరత్వం కలిగిన ఖషోగ్గి.. ద వాషింగ్టన్ పోస్ట్‌లో జర్నలిస్టుగా పనిచేస్తూ.. సౌదీ రాచరిక పాలనను అతను తీవ్రంగా విమర్శించేవారు.