భారత్‌కు చెందిన కృష్ణకుమారి కొహ్లీ పాకిస్తాన్‌లో చరిత్ర సృష్టించింది. ఆమె అక్కడి సింధ్ ప్రావిన్సులో సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉన్న దేశంలో సెనేటర్ అయిన తొలి హిందూ దళిత మహిళగా కృష్ణకుమారి నిలిచింది. సింధ్ ప్రావిన్సులో మహిళలకు రిజర్వ్ చేసి ఉన్న స్థానంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నుంచి ఆమె పోటీ చేసి ఎన్నికైంది. దీనిని మైనారిటీ హక్కులకు లభించిన అరుదైన గౌరవంగా పీపీపీ పేర్కొంది. గతంలో రత్న భగవాన్‌దాస్ చావ్లాను తొలి హిందూ మహిళా సెనేటర్‌గా పీపీపీ ఎన్నుకుంది.


సింధ్ ప్రావిన్స్‌లోని ధర్ జిల్లా నాగర్‌పర్కర్ శివారు గ్రామానికి చెందిన కొహ్లీ పేద వ్యవసాయ కుటుంబంలో 1979లో జన్మించారు. 9వ తరగతిలో ఉండగా 16 ఏళ్ల ప్రాయంలోనే లాల్‌చంద్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా విద్యాభ్యాసం కొనసాగించిన కొహ్లీ.. 2013లో సింధ్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.