లాస్‌వెగాస్: అమెరికాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం లాస్‌వెగాస్‌లో ఊహించని ఘోరం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైన వందలాది మంది గాయాల పాలవ్వగా.. దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు దుండగులు అరాచకంగా జరిపిన కాల్పుల వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దుండగులను పట్టుకొనేందుకు భద్రతా దళాలు వెనువెంటనే సంఘటనా స్థలానికి చేరి, అనుమానిత స్థానిక మాన్ డ్లే హోటల్ వద్ద మాటు వేశాయి. అక్కడ పోలీసులు ఒక దుండగుడిని హతమార్చి, తనను 64 ఏళ్ల స్టీఫెన్ పాడక్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ  కేసును దర్యాప్తు చేస్తున్న లాస్‌వెగాస్ మెట్రో పోలీస్ డిపార్టుమెంటు ఈ ఘటనకు సంబంధించి మారిలో డాన్లే అనే యువతికి కూడా సంబంధం ఉన్నట్లు తేల్చారు. ఆమెను కూడా వెతికి పట్టుకోనున్నట్లు ప్రకటించారు. 


 "ది రూట్ 91 హార్వెస్ట్ కంట్రీ" అనే సంగీత కార్యక్రమానికి హాజరైన దుండగులు, సమయం చూసి జనులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అలా గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారిక సమాచారం. దుండగులు తుపాకీలతో కాల్పులు జరుపుతున్న సందర్భంలో, ఎన్నో వందల మంది ప్రాణాల కోసం పరుగులు తీసిన వీడియోలు ఇప్పటికే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయి. ఒక ప్రణాళికతో ముందుగానే ప్లాన్ చేసి ఈ అరాచకానికి పాల్పడినట్లు పలువురు అధికారులు తెలుపుతున్నారు. దుండగులు స్థానిక హోటలైన మాన్ డ్లే లోని 32వ అంతస్తులోకి వచ్చి కాల్పులు జరిపి  ఉండవచ్చని పోలీసుల అభిప్రాయం. ఈ ఘటన జరగగానే దాదాపు అమెరికాలోని అన్ని ముఖ్య ప్రాంతాలన్నిటికీ హై అలర్ట్ ప్రకటించారు.