అల్జీరియాలో మిలిటరీ విమానం కూలిపోయిన దుర్ఘటనలో దాదాపు 105 మందికిపైగా దుర్మరణం చెందినట్టుగా తెలుస్తోంది. అల్జీరియా రాజధాని అల్జీర్స్ కి సమీపంలోని బౌఫరిక్ వైమానిక స్థావరం సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విమానం కూలిపోయిన సమయంలో అందులో 100 మందికిపైగా ప్రయాణిస్తున్నారని కొన్ని వర్గాలు చెబుతోంటే, అందులో 200 మందికిపైగా ప్రయణిస్తున్నట్టు ఇంకొన్ని వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఘటనాస్థలంలో 14 అంబులెన్సులు క్షతగాత్రులని ఆస్పత్రులకి తరలించడంలో సేవలు అందిస్తున్నాయి. క్షతగాత్రులకి అత్యవసర వైద్య సేవలు అందించే ప్రయత్నంలో భాగంగా ఎయిర్ పోర్టుకి దారితీసే రహదారులపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా వుండటం కోసం అటు వైపు సాధారణ ప్రయాణికులని ఎవ్వరినీ అనుమతించకుండా దారులు మూసేశారు. అల్జీరియా వైమానిక దళం ఉపయోగించే భౌఫరిక్ వైమానిక స్థావరం నుంచి విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపట్లోనే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పశ్చిమ అల్జీరియాలోని బెచర్ నగరానికి బయల్దేరిన ఇలియుషిన్ 1L 76 యుద్ధ విమానం ఈ ప్రమాదం బారిన పడింది. 1L 76 యుద్ధ విమానం అనేది ఆ దేశ యుద్ధ విమానాల్లో మధ్య తరహా శ్రేణికి సంబంధించినదిగా అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి. 


యుద్ధంలో సైనికులు ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం కోసం, యుద్ధ సామాగ్రి రవాణా కోసం ఈ యుద్ధ విమానం ఉపయోగిస్తున్నారు. అత్యవసర విపత్తులోనూ సహాయ చర్యల నిర్వహణ కోసం సైతం ఈ యుద్ధ విమానాన్ని ఉపయోగిస్తున్నారు.