మయన్మార్ నూతన అధ్యక్షుడిగా విన్ మింట్‌ను ఆదేశ పార్లమెంటరీ ఎన్నుకుంది. మింట్ మయన్మార్ దేశానికి 10వ అధ్యక్షుడు. దేశ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ డెమోక్రసీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన మింట్‌కు మూడింట రెండొంతుల ఓట్లుపడ్డాయి. సూకీకి మింట్ అత్యంత విశ్వాసపాత్రుడు, విధేయుడు కావడంతో ఆయన గెలుపు సులువైంది.మాజీ అధ్యక్షుడు హతిన్ కావ్ ఆరోగ్యం సరిగా లేని కారణంగా వారం రోజుల క్రితం తన పదవికి రాజీనామా సమర్పించడంతో పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొంది.


అధ్యక్షుడు విన్ మింట్ 1951లో జన్మించారు. ఆయన యంగూన్ వర్సిటీలో జియాలజీ సబ్జెక్ట్‌లో డిగ్రీ చేశారు. ఆతరువాత న్యాయపట్టా పొందారు. 1981లో యంగో హైకోర్టులో న్యాయవాది అయ్యారు. ఆతరువాత అతికొద్దికాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ మయన్మార్ అత్యున్నత న్యాయస్థానంలో కూడా న్యాయవాదిగా మారారు. మింట్ మొట్టమొదటిగా 1990లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆతరువాత 2012 ఉప ఎన్నికలలో, 2015 సాధారణ ఎన్నికలలో అతను విజయం సాధించారు. ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.