'కరోనా వైరస్' అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టి.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి కారణంగా అమెరికాకు ఇప్పటికే భారీగా ఆర్ధిక, ప్రాణ నష్టం వాటిల్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా ప్రభావితమైన దేశం అమెరికా. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHOపై ఆగ్రహంగా ఉంది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రోజురోజుకు వారి మధ్య యుద్ధం ముదురుతోంది. కరోనా వైరస్ చైనాలోని ప్రయోగశాలలో పుట్టిందని అమెరికా వాదిస్తోంది. ఐతే దీనికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO కొట్టిపారేసింది. దీనిపై సోమవారం నాడు మరోసారి చిచ్చు రేగింది.  


చైనాలోని ప్రయోగశాలలోనే కరోనా వైరస్ పుట్టిందనే తప్పుడు ప్రచారాన్ని నమ్ముతున్న అగ్రరాజ్యం అమెరికా ఎలాంటి ఆధారాలు చూపడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విమర్శించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు చూపించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని WHO ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖెల్ రియాన్ మీడియాకు తెలిపారు. 


మరోవైపు చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే  పదే వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించి తగిన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. చైనా ప్రభుత్వం కరోనా వైరస్ ను నియంత్రించడంలో విఫలమైందని నిందించారు. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనాలోని వుహాన్ వైరాలజీ   ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందన్న దానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ సహా ఇతర వైరస్‌లను వ్యాప్తి చెందించిన చరిత్రకు చైనాకు ఉందని విమర్శించారు. అంతే కాకుండా చైనాలో ఉన్న  ప్రయోగశాలలన్నీ నాసిరకమైనవని అన్నారు.చైనా దాచిపెట్టిన రహస్యం.. అంతర్జాతీయ పారదర్శకతను విచ్ఛిన్నం చేసిందని  అమెరికా, కెనెడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ కు చెందిన గూఢచర్య సంస్థ 'ఫైవ్ ఐస్' పేర్కొంది. 
  
మరోవైపు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నిన్నటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 2 లక్షల 50 వేల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.