పాకిస్తాన్లో సోషల్ పాఠ్య పుస్తకాలపై నిషేధం
పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలలో పిల్లల సోషల్ స్టడీస్ టెక్స్ట్ పుస్తకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే.. పలు ప్రైవేటు పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో కాశ్మీర్ భారతదేశంలో ఉందని తెలియజేసే మ్యాపులు ప్రచురితమవ్వడమే అందుకు కారణం.
పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలలో పిల్లల సోషల్ స్టడీస్ టెక్స్ట్ పుస్తకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే.. పలు ప్రైవేటు పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో కాశ్మీర్ భారతదేశంలో ఉందని తెలియజేసే మ్యాపులు ప్రచురితమవ్వడమే అందుకు కారణం. ఈ మేరకు పాఠ్యపుస్తకాల బోర్డు ఆయా పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులను నమోదు చేసింది.
వెంటనే అలాంటి ప్రచురణలు ఉన్న పుస్తకాలను పాఠశాలలకు వెళ్లి స్వాధీనం చేయాలని విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్సులోకి వచ్చే అనేక పాఠశాలలలో ఈ నిషేధం చోటు చేసుకుంది. 2,4,5,7,8 తరగతుల సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ప్రచురించిన మ్యాపుల్లో కాశ్మీరు భారతదేశంలో ఉన్నట్లు తెలపడంతో బోర్డు తీవ్ర అభ్యంతరం తెలిపింది. వెంటనే విచారణకు కూడా ఆదేశించింది.
ఇలాంటి తప్పిద్దాలు జరగకుండా ఉండాలంటే.. బోర్డు మందస్తు అనుమతి లేకుండా ఏ పాఠశాల కూడా పుస్తకాలను ప్రచురించడం లేదా అమ్మడం చేయకూడదని పాకిస్తాన్ పాఠ్య పుస్తకాల బోర్డు తెలిపింది.
అదేవిధంగా ఇస్లామ్ మతానికి వ్యతిరేకంగా ప్రచురితమయ్యే ఏ విధమైన అంశం కూడా పాఠ్య పుస్తకాల్లో ఉండడానికి వీల్లేదని.. అలాంటి ప్రతులకు బోర్డు అనుమతిని అందివ్వదని కూడా బోర్డు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ఏ విషయమైనా కూడా పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఉండడానికి వీల్లేదని.. అలా ప్రచురించే పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని బోర్డు తెలిపింది.