పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆదివారం 68 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. గతంలో అనుకోకుండా సముద్రం ద్వారా సరిహద్దు మార్గంలోకి ప్రవేశించిన భారతీయ జాలరులకు ఎట్టకేలకు విడుదల సిద్ధించింది. అలా విడుదల చేసిన ఖైదీలను లాహోర్‌లో ట్రైన్ ఎక్కించి, వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చి, భారత సైనికాధికారులకు అప్పగించనున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ హోంశాఖ అధికారి నసీమ్ సిద్ధిఖీ ధ్రువీకరించారు. పూర్తి భద్రతతో విడుదలైన ఖైదీలను లాహోర్ రైల్వేస్టేషనుకు తీసుకొస్తున్నట్లు, అక్కడ వారికి ఈదీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డబ్బు, కానుకలు అందించి స్వదేశానికి పంపిస్తు్న్నట్లు హోంశాఖ తెలిపింది.


ఇదే సంవత్సరం జులైలో లాంధీ జైలులో ఖైదీలుగా ఉన్న 78 మంది జాలరులను విడుదల చేసిన పాక్ ఇప్పుడు తాజాగా మరికొంతమందిని విడుదల చేసింది. ఇంకా 200 మంది జాలరులు పాక్‌లోని వివిధ జైళ్లల్లో మగ్గుతున్నట్లు సమాచారం. డిసెంబరు 2016లో మరియు జనవరి 2017లో పాకిస్తాన్ మలీర్, లాంధీ జైళ్లలో ఉంటున్న రెండు బ్యాచ్‌ల ఖైదీలను విడుదల చేసింది. ఆ బ్యాచ్‌ల్లో దాదాపు 438 ఖైదీలు ఉండడం గమనార్హం. పడవల మీద వచ్చి, అరేబియా సముద్రంలో చాలా దూరం వెళ్లి చేపలు పడుతున్నప్పుడు సరైన సరిహద్దు ప్రణాళికను అర్థం చేసుకోలేక ఇరు దేశాల జాలరులు కూడా భద్రతాధికారులకు ఖైదీలుగా చిక్కుతున్నారు.