పాకిస్తాన్ మా కుటుంబాన్ని అవమానించలేదు: జాదవ్
పాకిస్తాన్‌లో మరణశిక్ష విధించబడిన భారతీయుడు కుల్బూషన్ జాదవ్‌కు సంబంధించిన ఓ వీడియోని ఆ దేశ ప్రభుత్వం ఈ రోజే మీడియాకి విడుదల చేసింది.
పాకిస్తాన్‌లో మరణశిక్ష విధించబడిన భారతీయుడు కుల్బూషన్ జాదవ్‌కు సంబంధించిన ఓ వీడియోని ఆ దేశ ప్రభుత్వం ఈ రోజే మీడియాకి విడుదల చేసింది. ఆ వీడియోలో జాదవ్ మాట్లాడుతూ "పాకిస్తాన్ అధికారులకు ముందు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా తల్లిని, భార్యను కలిసే అవకాశాన్ని వారు నాకు కల్పించారు. అయితే వారు నాతో మాట్లాడుతున్నప్పుడు కాస్త భయంగా ఉన్నట్లు అనిపించింది. అందుకు కారణం వారితో పాటు వచ్చిన భారతీయ అధికారి వారిపై అరవడమే అనుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఇక్కడ ఆరోగ్యంగానే ఉన్నాను. నన్ను చూసి మా అమ్మ ఎంతో సంతోషించింది. అయితే మా తల్లిగారు విమానంలో ఇక్కడకు వస్తున్నప్పుడు భారతీయ అధికారులే వారిని దూషించనట్లు తెలిసింది. మా అమ్మతో పాటు వచ్చిన ఓ ఇండియన్ అఫీషియల్ మా అమ్మను తిట్టసాగాడు." అని జాదవ్ తెలిపారు.
గతంలో భారత విదేశాంగమంత్రి సుష్మ స్వరాజ్ జాదవ్ కుటుంబం పట్ల పాకిస్తాన్ అధికారులు దురుసుగా వ్యవహరించిన తీరు పై మాట్లాడిన తర్వాత.. వారాల వ్యవధిలో పాకిస్తాన్ జాదవ్‌కి సంబంధించిన ఈ వీడియోని మీడియాకి విడుదల చేయడం గమనార్హం. పాకిస్తాన్ అధికారులు జాదవ్ తల్లి చీరని విప్పించి.. సల్వార్ కమాజ్ వేసుకోమనేలా ఒత్తిడి చేయడం.. మంగళసూత్రం తీసివేయాలని, సిందూరం తుడిచేయాలని చెప్పడం.. అలాగే మరాఠీలో మాట్లాడకూడదని ఒత్తిడి చేయడం.. అలాగే జాదవ్ భార్య చేత బూట్లు విప్పించడం చేశారని, జాదవ్ కుటుంబసభ్యులే చెప్పడం మనకు తెలిసిందే. దీనిపై స్పందించిన సుష్మ స్వరాజ్ పాకిస్తాన్ వైఖరిని తప్పుపడుతూ, పార్లమెంటులో ఘాటుగా స్పందించారు.
అయితే భారత్ చేస్తున్నవన్నీ ఆరోపణలేనని.. తాము జాదవ్ కుటుంబాన్ని గౌరవించామని వారు తెలపడం గమనార్హం. "జాదవ్ కుటుంబీకులు వచ్చి అతన్ని కలిసి వెళ్లేవరకు జరిగిన ప్రతీ విషయం మా దగ్గర రికార్డు ఉంది" అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు.