అమెరికా సాయం నిలిపివేత.. పాక్ సర్కార్ అత్యవసర భేటీ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ పై మండిపడంతో పాక్ ఇప్పుడు ఏమి చేయాలో అర్థంకాక తలపట్టుకుంది.
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ పై మండిపడంతో పాక్ ఇప్పుడు ఏమి చేయాలో అర్థంకాక తలపట్టుకుంది. పాక్ ఉగ్రవాదులకు ఊతంగా ఉందంటూ.. ఆదివారం డోనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ కు నిధులు ఆపేసాడు. మిలిటరీకి కేటాయించే దాదాపు 255 మిలియన్ డాలర్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో పాక్ కు ఏమీ పాలుపోవడంలేదు. ఈ విషయంపై పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ.. విదేశాంగ మంత్రితో అత్యవసరంగా భేటీ అయ్యారు. భేటీ అనంతరం.. "అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై త్వరలోనే స్పందిస్తాం. వాస్తవానికి, కల్పనకు మధ్య తేడా ఏంటో ప్రపంచానికి చెప్తాం" అని విదేశాంగ మంత్రి చెప్పారు. అమెరికా చేసిన వ్యాఖ్యలపై నేడు పాకిస్తాన్ అత్యవసరంగా మంత్రిమండలి సమావేశం ఏర్పాటుచేసింది.
కాగా.. బుధవారం జాతీయ భద్రతా కమిటీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ట్రంప్ పాకిస్థాన్ పై చేసిన వ్యాఖ్యలపై ఏవిధంగా స్పందించాలో ఆ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి, హోమ్, రక్షణ, త్రివిధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు హాజరుకానున్నారు.