భారత ప్రథమ పౌరుడు, రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ మూడు రోజుల తజికిస్థాన్‌ ప‌ర్యట‌న‌కై బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతి కోవింద్, ఆయన స‌తీమ‌ణి, దేశ ప్రథమ మహిళ సవితా కోవింద్‌‌తో కలిసి తజకిస్థాన్‌ పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల తజకిస్థాన్ పర్యటనకు ఆదివారం న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు తజకిస్థాన్‌లో రాష్ట్రపతి పర్యటన సాగుతుంది. పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రపతి కోవింద్ త‌జికిస్థాన్‌ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు పరస్పర సహకారాలపై చర్చించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


మ‌ధ్య ఆసియాలోని ఈ దేశానికి తొలిసారిగా వెళ్తున్న రాష్ట్రపతి కోవింద్.. రెండు దేశాల మ‌ధ్య సంబంధాల బ‌లోపేతంపై అక్కడి అగ్ర నేత‌ల‌తో చ‌ర్చల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా త‌జికిస్థాన్ అధ్యక్షుడు ఇమామ్ అలీ ర‌హ్మాన్, పార్లమెంటు స్పీక‌ర్ షుకూర్‌జాన్ జుహురోవ్‌, దిగువ స‌భ స్పీక‌ర్‌ల‌తో భేటీ అవుతార‌ని భార‌త విదేశాంగ శాఖ ఒక ప్రక‌ట‌న‌లో తెలిపింది. అలాగే త‌జికిస్థాన్ ప్రధాన‌మంత్రి ఖోహిర్ ర‌సూల్‌జాదా కూడా కోవింద్‌తో స‌మావేశ‌మ‌వుతార‌ని పేర్కొంది. భార‌త ర‌క్షణ శాఖ స‌హాయ‌మంత్రి సుభాష్ భ‌మ్రే, రాజ్యస‌భ స‌భ్యుడు షంషేర్ సింగ్ మ‌న్హాస్ కూడా రాష్ట్రప‌తి వెంట వెళ్లే అధికార ప్రతినిధి బృందంలో స‌భ్యుల‌ని తెలిపింది.


తజికిస్థాన్‌ అధ్యక్షుడు ఇమామ్ అలీ ర‌హ్మాన్ ఇప్పటివరకు ఐదుసార్లు భారతదేశంలో పర్యటించారు. డిసెంబరు 2016లో రహమాన్‌ చివరిసారిగా భారత్‌ను సందర్శించారు.