టోక్యో: జపాన్‌లో అనుకోని ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఎవరికీ ప్రాణనష్టమైతే జరగలేదు కానీ.. 64 మంది రెండు గంటలు ఊపిరి బిగపట్టుకొని ఒకే చోట ఉండిపోయారు. 100 అడుగుల ఎత్తులో తలక్రిందులుగా వేలాడారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని యూనివర్సల్ స్టూడియోస్ ఎమ్యూజ్‌మెంట్ పార్కులో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:40ల సమయంలో ఎమ్యూజ్‌మెంట్ పార్కులో అనుకోకుండా రోలర్ కోస్టర్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో అందులో విహరిస్తున్న సుమారు 64 మంది 2 గంటలపాటు  దానినే అంటిపెట్టుకుని తలక్రిందులుగా వేలాడుతూ ఉండిపోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం, ఎమర్జెన్సీ స్టాప్ కారణంగా 100 అడుగుల ఎత్తులో వీరంతా చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాగా వీరిని పార్కు సిబ్బంది ఎమర్జెన్సీ మార్గంలో బయటకు తీసువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. కాగా గతంలో కూడా ఈ పార్కులో ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. 1120 మీటర్ల పొడవైన ఈ రోలర్ కోస్టర్‌ను 2016 మార్చిలో అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది.