శ్రీలంకలో మత ఘర్షణలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాండీ సెంట్రల్ జిల్లాలో మతఘర్షణలు చెలరేగడం‌తో ప్రభుత్వం దేశంలో 10 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. "నేడు జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో దేశంలోని ఇతర ప్రాంతాలకు మత ఘర్షణలు వ్యాప్తి చెందకుండా 10 రోజులు అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని నిర్ణయించారు" అని ప్రభుత్వ ప్రతినిధి దయాసిరి జయససేకర తెలిపారు. "ఎమర్జన్సీ సందర్భంగా ఫేస్బుక్ ద్వారా హింసను ప్రేరేపించే వ్యక్తులపై కఠిన చర్య తీసుకోవాలని నిర్ణయించింది మా ప్రభుత్వం" అని ఆయన తెలిపారు. శ్రీలంకలో సోమవారం అధికారులు కేంద్ర హిల్ స్టేషన్ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ముస్లిం తెగలకు, బౌద్ధులకు మధ్య కొంతకాలం నుండీ శ్రీలంకలో మతపరమైన వివాదాలు తలెత్తడం వలన ఘర్షణలు చెలరేగుతున్నాయి.