తైవాన్‌లో భూకంపం.. కూలిపోయిన హోటల్ బిల్డింగ్
తైవాన్‌లో మంగళవారం భారీ భూకంపం
తైవాన్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.4గా నమోదైనట్టు సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి. ఈ భూకంపం కారణంగా హాలియెన్‌లోని మార్షల్ హోటల్ భవనం ఓ పక్కకు ఒరిగింది. భవనం కింది భాగం కొంతమేరకు భూమిలోకి చొచ్చుకుపోయింది.
ఘటనాస్థలంలో అత్యవసర సేవలు అందిస్తున్న అగ్నిమాపక సిబ్బంది తైవాన్ స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కకు ఒరిగిన 9 అంతస్తుల భవనంలో సుమారు 30 మంది వరకు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. తైవాన్ టెలివిజన్ మీడియా కథనాలు ప్రసారం చేసిన దృశ్యాల ప్రకారం హాలియెన్‌లో మరో మూడు, నాలుగు భవనాల పరిస్థితి ఇదే విధంగా వున్నట్టు సమాచారం.
సముద్రం ఒడ్డున వున్న బీచ్ సిటీ కావడంతో హాలియెన్ నిత్యం పర్యాటకుల రాకతో రద్దీగా వుంటుంది. తైవాన్‌లో భూకంపంపై స్పందించిన తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్.. సత్వరమే బాధితులను ఆదుకుంటాం అని తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రకటించారు.