భారత్, చైనాలపై నోరుపారేసుకున్న డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత్, చైనాలపై నోరుపారేసుకున్నారు.
అగ్రరాజ్యం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత్, చైనాలపై నోరుపారేసుకున్నారు. చైనా, భారత్‌లకు రాయితీలు నిలిపివేస్తామని ట్రంప్ చెప్పారు. తమ దేశాన్ని ప్రపంచమంతా అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తోందని.. కానీ అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థే అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
శుక్రవారం ఉత్తర డకోటా రాష్ట్రంలోని ఫార్గో నగరంలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అమెరికా ఇతర దేశాలకు అనవసరంగా ఆర్థిక సహాయం చేస్తోందని, దాన్ని నిలిపివేయాలని చెప్పారు. తాము కూడా ఇండియా, చైనా ఆర్థిక వ్యవస్థలాంటి వాళ్లమే కాబట్టి వారికి సబ్సిడీలు ఇవ్వడం కుదరదని ట్రంప్ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తాము నిధులు ఇవ్వాల్సి వస్తోందని.. ఇకమీదట అలాంటివి కుదరదని అన్నారు. అమెరికాను కూడా వేగంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని, ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో), చైనాలపైనా విరుచుకుపడ్డ ట్రంప్.. ఇతర దేశాల నుంచి దాడులు జరగకుండా అమెరికా రక్షణ పొందుతున్న ధనిక దేశాలు.. సొమ్ము ఇవ్వాల్సిందేనని నాటో కూటమి ఉద్దేశిస్తూ.. పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. 'ఇతర దేశాలకు రక్షణగా ఉండడం మంచిదే. అందుకు వారు మనకు సొమ్ము చెల్లించాల్సిందే’’ అని అన్నారు.