అత్యాచారాలపై దారుణమైన చట్టం తెస్తున్న టర్కీ!
ఇదివరకే మహిళలు, బాలికలపై అక్కడ లైంగిక దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కానీ సమస్యకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వమే అత్యాచారాలని ప్రోత్సహించేలా చట్టం తీసుకొస్తున్నారు.
సమాజంలో మహిళలకు భద్రత పెంచాలని, రోజులు మంచిగా లేవంటూ తల్లిదండ్రులు, మహిళా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వాలు సైతం ఎప్పటికప్పుడూ చట్టాల్లో సవరణలు చేస్తూ రేపిస్టులకు ఉరిశిక్షలు త్వరగా అమలయ్యేలా తీర్పులు వస్తున్నాయి. కానీ టర్కీ దేశంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అత్యాచార దోషులను శిక్షల నుంచి రక్షించేందుకు సహకరించేలా ఉన్న ‘మ్యారీ యువర్ రేపిస్ట్’ అనే కొట్ట చట్టాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకురానుంది. ఈ మేరకు జనవరి నెలాఖరులోగా టర్కీ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆడ, మగ సమానం అనేది ప్రకృతి విరుద్దమంటూ టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ పలుమార్లు వ్యాఖ్యానించారు.
మ్యారీ యువర్ రేపిస్ట్ బిల్లు ఆమోదం పొందితే.. దీని ప్రకారం 18ఏళ్లలోపు చిన్నారులు, యువతులపై లైంగిక దాడులు, అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు చట్టం వర్తిస్తుంది. లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన నిందితులు ఆ కేసులో శిక్షల నుంచి బయటపడాలంటే బాధితురాలిని పెళ్లిచేసుకునే విధంగా ఈ బిల్లులో అంశాలున్నాయి. త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై టర్కీ దేశవ్యాప్తంగా నిరసన మొదలైంది. మహిళల హక్కులు కాలరయడంతో పాటు అత్యాచారాలకు ప్రోత్సహించడమే అవుతుందంటూ మహిళా సంఘాలు, మహిళా హక్కులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఇలాంటి బిల్లునే 2016లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా టర్కీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా మరోసారి ఆ ఆరాచాక బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలని ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. జీవిత భాగస్వాముల నుంచి 38శాతం మంది లైంగిక, శారీరక వేధింపులకు గురవుతున్నారు. గత దశాబ్దంలో 4.82 లక్షల మైనర్లకు బాల్య వివాహాలు చేశారు. 2017 ఏడాదిలో దాదాపు 409 మంది మహిళలు భర్తల చేతిలో హత్యకు గురయ్యారు.