న్యూజిలాండ్ ప్రధాని జేసిండా ఆర్డన్, ఆమె కూతురు చరిత్ర సృష్టించారు. జేసిండా.. తన మూడు నెలల చిన్నారిని ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ హాలులోకి తీసుకొచ్చి రికార్డు నెలకొల్పారు. ఒక దేశ ప్రధానిగా బిడ్డకు జన్మనిచ్చిన అతికొద్ది మంది ప్రపంచ నాయకులలో ఒకరైన ఆర్డన్, అసెంబ్లీ హాల్‌కు తన కుమార్తె నేవేను తీసుకొచ్చారు. మూడునెలల పాప నేవే కూడా తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో అడుగుపెట్టి రికార్డు సృష్టించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐరాస జనరల్ అసెంబ్లీకి భర్త క్లార్క్ గేఫోర్డ్ చిన్నారిని తీసుకొని వచ్చారు. ఆయన న్యూజిలాండ్ ఉన్నతాధికారులతో కలిసి గ్యాలరీలో ఆర్డర్ పక్కన కూర్చున్నారు. ఆ సమయంలో నేవేను తల్లి ఆర్డన్ ఎత్తుకొని ప్రేమగా ముద్దు పెట్టింది. ఐరాసలో నెల్సన్ మండేలా శాంతి సమావేశంలో ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకున్నట్లు సీఎన్ఎన్ నివేదించింది. చిన్నారితో ప్రధాని జేసిండా ఆర్డన్ ఆడుతున్న సమయంలో ప్రపంచ మీడియా ఛానళ్లు ఈ దృశ్యాలను కెమెరాల్లో చిత్రీకరించారు. ఆ తర్వాత జేసిండా నెల్సన్ మండేలా శాంతి సమాఖ్యలో ప్రసంగించారు. చిన్నారిని ముద్దాడుతూ కనిపించిన ఆమెలో ఒక మాతృమూర్తి కనిపించిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెట్టారు.   


జేసిండా భర్త క్లార్క్ గేఫోర్డ్ ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో వ్యాఖ్యాతగా ఉన్నారు. ప్రధాని జేసిండా తన కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో చిన్నారి బాగోగులన్నీ భర్త గ్రేఫోర్డ్ చూసుకుంటారు. ఈ సందర్భంగా చిన్నారి నేవేకు ఐక్యరాజ్యసమితి ఇచ్చిన డిప్లొమాటిక్ ఫోటో ఐడీని సోషల్ మీడియాలో గ్రేఫోర్డ్ పోస్ట్ చేశారు. 'న్యూజిలాండ్ మొదటి బేబీ..' అంటూ ఆయన ట్వీట్ చేశారు.


న్యూజిలాండ్ ప్రధానిగా అతి పిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టి జేసిండాకు మరో రికార్డు కూడా ఉంది. ప్రధానిగా ఉన్న సమయంలో జూన్‌లో బిడ్డకు జన్మనిచ్చిన జేసిండా.. ఆరు వారాల పాటు మెటర్నటీ సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో డిప్యూటీ ప్రధాని విన్స్టన్ పీటర్స్ బాధ్యతలు నిర్వహించారు.


గత సంవత్సరం ఆగస్టులో న్యూజిలాండ్ ప్రధాని జేసిండా ఆర్డన్ బాధ్యతలు తీసుకున్నారు. లేబర్ పార్టీకి చెందిన అతి పిన్న వయస్కురాలు ఈమె.