పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంటిపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన పాకిస్తాన్‌లో తీవ్ర అలజడిని కలిగిస్తోంది. జస్టిస్ ఇజాజ్ ఉల్ ఎహసాన్ ప్రస్తుతం పాక్ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి కేసులకు సంబంధించి ఆయన త్వరలోనే తీర్పు కూడా ఇవ్వనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఆయనపై హత్యాయత్నం జరగడం అనేది పలు అనుమానాలకు తావిస్తోంది అని పాకిస్తాన్‌లో పలు మీడియా సంస్థలు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అయితే ఈ కాల్పులలో ఎవరికీ ఎలాంటి ప్రమాదము జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కాల్పులు చేసిన దుండగులు రెండు సార్లు ప్రయత్నించడం గమనార్హం. ఉదయం 4:30 గంటలకు, అలాగే ఉదయం 9:00 గంటలకు వారు కాల్పులు జరిపినట్లు సమాచారం


అయితే ఈ ఘటనను సాధారణమైన ఘటనగా పరిగణించరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మియాన్ సఖీబ్ నిసార్ తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్ వెంటనే రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాలని తెలిపారు. అలాగే ఇది ఏరియల్ ఫైరింగా లేదా కావాలనే న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారా అన్న విషయం కూడా తేలాల్సి ఉందని ఆయన తెలిపారు.


అయితే పోలీసుల కథనం రెండు బుల్లెట్లు మాత్రం ఇంటి వైపు దూసుకువచ్చాయని తెలుస్తోంది. అందులో ఒకటి ఎంట్రన్స్ గేటుని తాకగా.. మరొకటి కిచెన్ డోర్ మీదుగా వెళ్లింది. ఈ ఘటనపై ప్రధాని అబ్బాసీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ పనిచేసిన వారిని సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్‌‌ను తప్పు పట్టారు. ఆయన వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు