న్యూయార్క్: కరోనావైరస్ పుట్టుకపై అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ మనిషి సృష్టించిందేనని, చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో ప్రమాదవశాత్తుగా అది బయటపడిందని వస్తోన్న కథనాలను అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ డైరెక్టర్ కొట్టిపారేశారు. ప్రస్తుతం జరిపిన పరిశోధనల ప్రకారం కరోనావైరస్ మనిషి సృష్టించింది కాదని అమెరికాలోని ఇంటెలీజెన్స్ బృందాలు శాస్త్రీయంగానే ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ స్పష్టంచేసింది. ఈ మేరకు అమెరికాలోని డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలీజెన్స్ (DNI) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనావైరస్‌పై పోరాటంలో అమెరికా ప్రభుత్వానికి ఇంటెలీజెన్స్ తమ వంతు సహాయం అందిస్తోందని డిఎన్ఐ అభిప్రాయపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలోని ఇంటెలీజెన్స్ బృందాలను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలీజెన్స్ ముందుండి నడిపిస్తుంది. అంతేకాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో అమెరికా అధ్యక్షుడికి డీఎన్ఐ ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తుంది. 


వుహాన్‌లోని ఓ ల్యాబోరేటరీలో కరోనా వైరస్ తయారైందనే కథనాలు వెలువడిన అనంతరం యావత్ ప్రపంచం చైనాను వేలెత్తిచూపిస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఉద్దేశపూర్వకంగానే ఈ తరహా కుట్రలు చేసే కుయుక్తులు చైనాకు ఉన్నాయంటూ చైనాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఓవైపు అమెరికా అధ్యక్షుడి చేతిలో చైనా తీవ్ర విమర్శల పాలవుతున్న తరుణంలోనే అమెరికాకే చెందిన ఇంటెలీజెన్స్ కమ్యునిటీ ఈ తరహా నివేదిక ఇవ్వడం ప్రస్తుతం చర్చనియాంశమైంది. దీనిపై డొనాల్డ్ ట్రంప్ ఏమని స్పందిస్తారోననేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.