జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేకి ఊహించని షాక్ తగిలింది. ప్రజా ఆరోగ్య విషయాలపై  చైతన్యం తీసుకొచ్చేందుకు ముగాబేని గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రకటించాలని భావించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరల తమ నిర్ణయాన్ని పునరాలోచించుకుంటామని తెలియజేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేసస్, ముగాబేని అంబాసిడర్‌గా ప్రకటించిన నేపథ్యంలో మరోమారు ఈ విషయానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ముగాబే పరిపాలనలో జింబాబ్వేలో ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎంతో దిగజారిందని, అలాంటి వ్యక్తిని గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించడంలో సంస్థ ఆంతర్యమేమిటని కొందరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కి లేఖ రాసిన మీదట ఈ ప్రకటనను సంస్థ జారీ చేసింది.


జింబాబ్వే మానవ హక్కుల సంస్థ న్యాయవాది డాగ్ కోల్టర్ట్ మాట్లాడుతూ, ఎలాంటి ప్రామాణికతను అనుసరించి ముగాబేని సంస్థ అంబాసిడర్‌గా ప్రకటించిందో తెలపాలని కోరారు. 93 ఏళ్ళ రాబర్ట్ ముగాబే తన వైద్యం కోసమే ఎప్పుడూ విదేశాలకు వెళ్తున్నారని.. ఆ దేశ ప్రజలు మాత్రం కనీసం వైద్య సదుపాయాలు లేకుండా జీవిస్తున్నారని ఆయన తెలిపారు.


కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రడో ఈ విషయంపై స్పందిస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన ఏప్రిల్ ఫూల్ జోక్ లాంటిదని అభిప్రాయపడ్డారు. వెల్కమ్ ట్రస్ట్, ఎన్‌సీడీ ఎలయెన్స్, యూన్ వాచ్, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లాంటి సంస్థలు డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటనపై విముఖత తెలుపుతూ తమ వ్యతిరేకతను కూడా చాటాయి.