AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఘోర పరాజయం ఎదురైంది. వైనాట్ 175 లక్ష్యం కాస్తా మూడు పార్టీల కలయిక ముందు నీరుగారింది. మేలు పొందిన వర్గాలు, అందలమెక్కించిన సామాజికవర్గాలు దెబ్బతీశాయి. జరిగిన మేలు కంటే కులాధిపత్యానికే ప్రాధాన్యత చూపించడం ఊహించని పరిణామం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు జీర్ణించుకోలేని అంశం. ఈ ఫలితాలు ఆయన్ని ఎంతగా కుంగదీశాయో, వేదనకు గురి చేశాయో ఫలితాల తరువాత సాయంత్రం ఆయన మీడియా ముందుకొచ్చిన చేసిన వ్యాఖ్యలే చెబుతాయి. బీసీలకు అగ్రతాంబూలమిచ్చినా, సంక్షేమ పధకాలు అందరికీ ఇంటింటికీ చేర్చినా ప్రయోజనం లభించకపోవడాన్ని జగన్‌తో పాటు పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యర్ధి పార్టీలు కలిసి ఓట్ల శాతాన్ని తగ్గిస్తారనుకున్నారు కానీ, తన ఓటు బ్యాంకే తన నుచి జారిపోతుందని గ్రహించలేకపోయారు. 


వాస్తవానికి వైఎస్ జగన్ ముందు నుంచీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల్ని టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా బీసీ మంత్రాన్ని పఠిస్తూ వచ్చారు. రాజకీయంగా బీసీలకు అగ్రతాంబూలమిస్తూ వచ్చారు. 2019లోనూ, ఇప్పుడూ అదే పనిచేశారు. 2019లో వైఎస్ జగన్ ఘన విజయానికి బీసీలు కారణమయ్యారా లేక నవరత్నాలా అనేది పక్కనబెడితే ఈసారి మాత్రం జగన్ బీసీ మంత్రం పనిచేయలేదనే తెలుస్తోంది. సామాజికవర్గపరంగా రాజకీయాల్లో అగ్రస్థానమిచ్చినా బీసీలు పట్టించుకోలేదు. కారణం తమని కాపు, కమ్మ, రెడ్లతో కాకుండా ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లతో జత కలపడం. అంటే ఇక్కడ బీసీలకు ప్రయోజనం కంటే ఆధిపత్య గుణమే తొలి ప్రాధాన్యతగా మారింది. 


అందుకే కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని కాపులతో పాటు బీసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేద్కర్ పేరు పెట్టడంపై దళితుల్నించి వచ్చే ప్రయోజనం కంటే బీసీల్నించి ఎదురైన వ్యతిరేకతే డామినేట్ చేసిందనేది కాదనలేని సత్యం. ఎందుకంటే బీసీల్లో కులాధిపత్య ధోరణి కాస్త ఎక్కువగా ఉంటుంది. తమకెలాంటి ప్రయోజనాలు అందాయనేది ఆలోచించకుండా అగ్ర కులాలతో సమానంగా ఆదిక్యం ఉందో లేదో చూసుకుంటారు. అందుకే జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని రెండు ఉభయ గోదావరి జిల్లాల్లోని బీసీలు అంగీకరించలేకపోయారు. ఈ వ్యతిరేక నిరసనకు కాపులు ఆజ్యం పోశారు. 


ఇక దళితులైతే జగన్‌కు పూర్తిగా ఏకపక్షంగా చేయలేదనే తెలుస్తోంది. దళితుల్లోని ఉద్యోగవర్గాలు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేశాయి. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అందరూ జగన్ ప్రభుత్వం దిగిపోవాలనే కోరుకున్నారు. ఎన్ని ప్రయోజనాలు కల్పించినా, సంక్షేమం అందించినా ఉద్యోగ సంఘాల పిలుపుకే ప్రాధాన్యత ఇచ్చాయి. అందుకే జగన్ ఆశించినట్టుగా దళిత ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీకు మళ్లలేదు. 


జగన్ ఊహించినట్టుగా ఓటేసింది మాత్రం కేవలం మైనారిటీలే. మైనారిటీల్లో కూడా మార్పు వచ్చి ఉండేది కానీ కూటమిలో బీజేపీ చేరడంతో మైనారిటీ ఓటు బ్యాంకు అటువైపు మళ్లలేదు. దీనికితోడు ముస్లిం రిజర్వేషన్ల అంశం మైనార్టీలను వైసీపీకు మరింత దగ్గర చేసింది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా సంక్షేమ పధకాలు, పెన్షన్లు అందుకున్న ప్రజలు సైతం చివరి క్షణంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్‌కు ఆకర్షితులైనట్టు సమాచారం.


ఈ పరిణామాలతో జగన్ అంచనాలు పెట్టుకున్న సంక్షేమ పధక లబ్దిదారులు, బీసీలు, దళిత వర్గాలు , మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఏకపక్షంగా పనిచేయలేదు. మొత్తానికి తనవారనుకున్నవర్గాలే జగన్‌ను దెబ్బతీశాయి. స్థూలంగా చెప్పాలంటే వైఎస్ జగన్ ఏ వర్గాలపై నమ్మకం పెట్టుకున్నారో ఆ వర్గాలే అతన్ని దెబ్బతీశాయి. 


Also read: Naralokesh: పప్పు కాదూ నిప్పు.. 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన నారా లోకేష్..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook