ప్రకాశం జిల్లాలో ఆదివారం ఘోరం జరిగింది. ఉలవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నలుగురు పిల్లలతో సహా దంపతులు ఆదివారం రాత్రి విజయవాడ వైపు వెళ్లే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తల వయస్సు 35 సంవత్స రాల లోపే ఉంటుంది. అలాగే పిల్లలందరూ 10 సంవత్సరాల వయస్సులోపు వారే. పిల్లలలో ఇద్దరు మగపిల్లలు కాగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన పాశం సునీల్‌ (35)కు ప్రకాశం జిల్లాకు చెందిన రమా (32)తో వివాహమైంది. వీరు వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో నివాసం ఉంటూ మిక్సీ, గ్రైండర్లు వాయిదాల పద్ధతిపై ఇచ్చే వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఉషా (5), మూడేళ్ల వయసున్న కవల పిల్లలు కల్యాణ్, కల్యాణి, 8 నెలల వయసున్న మగబిడ్డ ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలే సామూహిక ఆత్మహత్యలకు కారణమని సమాచారం. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ ఉలవపాటు స్టేషన్‌కు చేరుకోగానే వీరు ఒక్కసారిగా రైల్వే ట్రాక్‌ మీదకు దూకి ఆత్మహత్య చేసుకున్నారని స్టేషన్‌మాస్టర్‌ చెప్పారు. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ వాడరేవు వినయ్‌చంద్‌, డీఎస్పీ ప్రకాశ్‌రావు, ఆర్పీఎఫ్‌ సీఐ అనురాగ్‌ కుమార్‌  పరిశీలించారు.