ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు చేకూర్చే దిశగా కీలక నిర్ణయమిది. అక్టోబర్ నెలలో జరిగిన పంట నష్టానికి నవంబర్ లోనే పరిహారం రైతుల ఖాతాల్లో చేరనుంది. తద్వారా ఖరీఫ్ నష్టాన్ని రబీలో పూడ్చుకోడానికి వీలవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నష్టం జరిగిన మరుసటి నెలలోనే పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. అది కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయ్యేట్టు. ఇప్పటికే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగిన నష్టానికి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అక్టోబర్ నష్టానికి అంచనాలు తయారవుతున్నాయని..దీనికి సంబంధించిన పరిహారాన్ని నవంబర్ నెలలోనే చెల్లించనున్నామని వైఎస్ జగన్ చెప్పారు.


ఖరీఫ్‌ పంటలో నష్టం జరిగితే.. రబీలోగా పరిహారం ఇవ్వగలిగితే.. రైతుకు మేలు కలుగుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా జగన్ తెలిపారు.  వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత చెల్లింపుల కార్యక్రమం సందర్భంగా జగన్ మాట్లాడారు. గతంలో అంటే 2014లో పంట నష్టం జరిగితే 2017 జనవరి వరకూ పరిహారం ఇవ్వలేదని.. 2015లో ఖరీఫ్‌లో నష్టానికి 2016 నవంబరులో పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా 2016 ఖరీఫ్‌ నష్టానికి 2017 జూన్‌లోనూ.. 2017 రబీ నష్టానికి పరిహారాన్ని 2018 ఆగస్టులో ఇచ్చారన్నారు. 2018 ఖరీఫ్‌ నష్టాన్నైతే పూర్తిగా ఎగ్గొట్టారని చెప్పారు.


Also read: AP: పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే పూర్తి చేస్తుంది: బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు


ఇకపై ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్‌లో నష్టపరిహారం చెల్లిస్తామని మీ బిడ్డగా, గర్వంగా చెబుతున్నానన్నారు. గత ప్రభుత్వ తీరుకు ఇప్పటికి తేడా గమనించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇక టీడీపీ నేత లోకేష్ పై పరోక్షంగా సెటైర్లు విసిరారు.  ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంపై దృష్టి మరల్చేందుకు టీడీపీ నేతలు ట్రాక్టర్లు పట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విత్తు వేసినప్పటి నుంచి పంట అమ్మే వరకూ రైతుకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో  10 వేల 641 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైఎస్సార్‌ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు, మోటార్లు వేయిస్తోంది.


గత ప్రభుత్వం రైతన్నలకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్‌కు సంబంధించిన 8 వేల 655 కోట్లను చెల్లించామన్నారు. ధాన్యం సేకరణ కింద 960 కోట్ల గత ప్రభుత్వ బకాయిల్ని చెల్లించినట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. మరోవైపు విత్తనాల సబ్సిడీగా 384 కోట్ల గత ప్రభుత్వ బకాయిల్ని కూడా తమ ప్రభుత్వం చెల్లించినట్టు తెలిపారు. ఇక రైతులకు 9 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇచ్చేందుకు వీలుగా 17 వందల కోట్ల ఖర్చుతో ఫీడర్ల కెపాసిటీ పనులు దాదాపుగా పూర్తి చేశామన్నారు. ఇక పంట భీమాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని..రైతులు కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే..1030 కోట్ల రూపాయల ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.


భారీ వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోవడం బాధ కల్గించిందని..అయితే చెరువులు, డ్యాంలు, బావులు అన్నీ నిండుకోవడంతో రబీకు సులభమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశించారు. Also read: AP: తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు